నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్‌బుక్‌ అప్‌డేట్‌ చూసి షాక్‌ తిన్న అభిమానులు

7 Jun, 2021 17:08 IST|Sakshi

పారిస్‌: ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు,  ప్రపంచ నంబర్‌ 3 ఆటగాడు, స్పెయిన్ బుల్ ర‌ఫేల్ న‌దాల్‌ సోమ‌వారం చేసిన ఓ ఫేస్‌బుక్ అప్‌డేట్ అత‌ని అభిమానులను అయోమ‌యానికి గురి చేసింది. గాట్ మ్యారీడ్ అంటూ ర‌ఫా త‌న రిలేషన్షిప్‌ స్టేటస్‌ను పొరపాటున అప్‌డేట్ చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. ఇది చూసి కొంద‌రు ఫ్యాన్స్ ఆనంద‌ప‌డ‌గా.. మ‌రికొంద‌రు నదాల్‌కు మళ్లీ పెళ్ళా అంటూ కామెంట్లు పోస్ట్‌ చేశారు. నిజానికి నదాల్‌కు 2019 అక్టోబర్‌లోనే ప్రేయసి మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోతో పెళ్ళైంది. అయితే ఈ అప్‌డేట్‌ చూసిన కొందరు అభిమానులు నదాల్‌ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడనుకుని పొరబడి, అతనికి శభాకాంక్షలు తెలిపారు. 

కాగా, నదాల్‌ పొరపాటున ఫేస్‌బుక్‌లో రిలేషన్షిప్‌ స్టేటస్‌ను అప్‌డేట్ చేయ‌డంతో అది కాస్తా అత‌ను ఆదివార‌మే పెళ్లి చేసుకున్నట్లుగా చూపించింది. ఇదిలా ఉంటే ఈ స్పెయిన్‌ బుల్‌ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఈ రౌండ్‌లో అతను ఇటలీకి చెందిన 19 ఏళ్ల జన్నిక్‌ సిన్నర్‌తో తలపడనున్నాడు. కాగా, రఫా ప్రస్తుతానికి 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌లు సాధించి స్విస్‌ యోధుడు రోజర్‌ ఫెదరర్‌తో(20) సమానంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే నదాల్‌కు మట్టి కోర్టుపై తిరుగులేని రికార్డు ఉంది. అతను 2005లో అరంగేట్రం చేసిన నాటి నుంచి కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయి 103 విజయాలు సాధించాడు. 
చదవండి: శ్రీలంకలో టీ20 ప్రపంచకప్‌..?

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు