HYD Vs ARNP: మనోళ్లు దంచికొట్టారు.. ఒక్కడే 323 నాటౌట్‌! తొలిరోజే 357 రన్స్‌ లీడ్‌

26 Jan, 2024 19:03 IST|Sakshi

Hyderabad vs Arunachal Pradesh- Hyderabad lead by 357 runs: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో హైదరాబాద్‌ అద్భుత ప్రదర్శన సాగుతోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ కెప్టెన్సీలో నాగాలాండ్‌పై 194 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్‌.. రెండో మ్యాచ్‌లో రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ సారథ్యంలో మేఘాలయను 81 రన్స్‌తో చిత్తు చేసింది.

172 పరుగులకే ఆలౌట్‌
ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ అద్భుత ఆట తీరుతో సిక్కింపై 198 పరుగుల తేడాతో గెలుపొందింది. హ్యాట్రిక్‌ విజయాల తర్వాత ఇప్పుడు మరో భారీ గెలుపుపై కన్నేసింది. ప్లేట్‌ గ్రూపులో ఉన్న హైదరాబాద్‌- అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య శుక్రవారం రంజీ మ్యాచ్‌ మొదలైంది.సొంతగడ్డపై నెక్స్‌జెన్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను 172 పరుగులకే కట్టడి చేసింది.

సంచలన ఆరంభం..
హైదరాబాద్‌ బౌలర్లలో సీవీ మిలింద్‌, కార్తికేయ మూడేసి వికెట్లు తీయగా.. టి.త్యాగరాజన్‌ రెండు, సాకేత్‌, ఇల్లిగరం సంకేత్‌ తలా ఓ వికెట్‌ తీశారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్‌ ఆరంభించిన హైదరాబాద్‌కు ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌, గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌ సంచలన ఆరంభం అందించారు.

33 ఫోర్లు, 21 సిక్సర్లు
తన్మయ్‌ ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ నమోదు చేయగా.. గహ్లోత్‌ 105 బంతుల్లో 185 రన్స్‌ చేసి పెవిలియన్‌ చేరాడు. తన్మయ్‌ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి రోజు ఆట ముగిసే సరికి 160 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ 323 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. 

రంజీ మ్యాచ్‌లో తన్మయ్‌ టీ20 తరహా ఇన్నింగ్స్‌ కారణంగా హైదరాబాద్‌ మొదటి రోజు వికెట్‌ నష్టానికి 48 ఓవర్లలోనే 529 పరుగులు చేసింది. తద్వారా అరుణాచల్‌ ప్రదేశ్‌పై 357 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తన్మయ్‌కు తోడుగా అభిరథ్‌ రెడ్డి 19 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు. 

చదవండి: చూసుకోవాలి కదా... జడ్డూ సైగ.. కోపంగా వెళ్లిన అశ్విన్‌! రనౌట్‌ వల్ల..

whatsapp channel

మరిన్ని వార్తలు