గేల్‌ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్‌ చేయాలి : అశ్విన్‌

21 Oct, 2020 15:56 IST|Sakshi
క్రిస్ గేల్‌, అశ్విన్‌( కర్టసీ : ఐపీఎల్‌/ బీసీసీఐ)

దుబాయ్ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ కింగ్స్‌ పంజాబ్‌ తుది జట్టులోకి అడుగుపెట్టాకా ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయిందనే చెప్పొచ్చు. గేల్‌ రాకముందు ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్‌ ఒక విజయం, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. అయితే గేల్‌ వచ్చిన తర్వాత హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేయడం విశేషం. గేల్‌ వచ్చి పెద్దగా మెరుపులు మెరిపించకపోయినా.. అతను ఆడుతున్న సుడిగాలి ఇన్నింగ్స్‌లు పంజాబ్‌ విజయాలను తేలికచేశాయని చెప్పొచ్చు. తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ 29 పరుగులే చేసినా.. అతను ఆడిన ఇన్నింగ్స్‌ వల్లే పంజాబ్‌ సులువైన విజయాన్ని నమోదు చేసింది. (చదవండి : ఐదో ప్లేయర్‌గా గబ్బర్‌..)

కాగా నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ను  రవిచంద్రన్‌ అశ్విన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీనికంటే ముందు ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గేల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతని షూ లేస్‌ ఒకటి ఊడిపోయింది. ఈ సందర్భంగా అశ్విన్‌ గేల్‌ షూలేస్‌ను కట్టి సరిచేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను అశ్విన్‌ సరదా క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. 'డెవిల్‌ చూడడానికి భయంకరంగా ఉంటుంది. అది చేసే విధ్వంసం కూడా అలాగే ఉంటుంది. ఇదే తరహా పోలిక నాకు గేల్‌లోనూ కనబడుతుంది. అందుకే గేల్‌ రెండు కాళ్లు కట్టేసి బౌలింగ్‌ చేయాలి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈరోజు కఠినమైన రోజు. కానీ వచ్చే మ్యాచ్‌లో విజయంతో ఫుంజుకొని తిరిగి బలంగా తయారవుతాం ' అంటూ కామెంట్‌ చేశాడు. (చదవండి :ఆ ప్రశ్నకు నాకు కోపం వచ్చింది: గేల్‌)

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ శిఖర్‌ ధావన్‌ మరోసారి సెంచరీతో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ధావన్‌ మినహా మిగతా ఎవరు రాణించకపోవడంతో ఢిల్లీ సాధారణ స్కోరునే నమోదు చేసింది. 165 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. మూడో ఓవర్లో అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఇన్‌ఫామ్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌ వెనుదిరిగినా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ వచ్చిన గేల్‌ తుషార్‌ దేశ్‌పాండే బౌలింగ్‌లో 25 పరుగులు పిండుకొని మ్యాచ్‌ స్వరూపమే మార్చేశాడు. కాసపటికే గేల్‌ అవుటైనా నికోలస్‌ పూరన్‌  53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న పంజాబ్‌ తన తదుపరి మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది.

మరిన్ని వార్తలు