వరల్డ్‌కప్‌నకు రషీద్‌ ఖాన్‌ పెళ్లికి సంబంధమేంటి?

13 Oct, 2020 13:31 IST|Sakshi

ఢిల్లీ: రషీద్‌ ఖాన్‌... ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారాడు. అందుకు కారణం గూగుల్‌లో రషీద్‌ ఖాన్‌ భార్య పేరు అని సెర్చ్‌ చేస్తే అనుష్క శర్మ అని రావడం. రెండేళ్ల​ క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ, తన ఫేవరెట్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ అని చెప్పాడు. ఆ వార్త ట్రెండ్‌ అయి గూగుల్‌లో అలా వస్తుందట. రషీద్‌ ఖాన్‌కు పెళ్లి కాలేదన్న విషయం మనందరికీ తెలుసు. అఫ్గనిస్తాన్‌ జట్టు ప్రపంచ కప్‌ గెలిచే వరకు తాను పెళ్లిచేసుకోనని ఈ ఏడాది జూలైలో ఇచ్చిన ఓ ఇంటర్వూలో వెల్లడించాడు. కానీ ప్రపంచ కప్‌ గెలవడానికి అతని పెళ్లికి ఏంటి సంబంధం అని అందరికీ ఒక ప్రశ్ర మిగిలిపోయింది. అదేంటో తెలుసుకుందామా.

అఫ్గనిస్తాన్‌...
మన భారత భూభాగంతో సరిహద్దు పంచుకునే దేశం. ఈ దేశం పేరు వినగానే ఉగ్రవాదుల దాడులు, అశాంతి, ఆకలి చావులు ఇలా అనేక విషయాలు మనకు గుర్తొస్తాయి. అక్కడి ప్రజలు అసలు ఎలా జీవిస్తున్నారని మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి దేశం నుంచి వచ్చినవాడే రషీద్‌ ఖాన్‌. అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌కు వైస్‌కెప్టెన్‌.
 
అదే ముఖ్య కారణం...
అఫ్గనిస్తాన్‌లో పుట్టిన రషీద్‌ ఖాన్‌ తమ దేశంలో జరిగిన యుద్ధాల కారణంగా వారి కుటుంబ సభ్యులు పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. కొన్నేళ్లకు మళ్లీ తిరిగి అఫ్గనిస్తాన్‌కు వచ్చేశారు. క్రికెట్‌ అంటే అతడికి పిచ్చి. షాహిద్‌ అఫ్రిదిని దైవంగా కొలిచేవాడట. అందకే తన స్పిన్‌ యాక్షన్‌ కూడా అలాగే ఉంటుంది. తమ దేశంలో రగులుతున్న అశాంతి చూసి అతడిని ఎంతగానో కలచివేసింది. క్రికెట్‌ ప్రపంచ కప్‌ గెలిస్తే ప్రపంచ దేశాల దృష్టి తమ దేశం వైపు పడుతుందని, దాని వల్ల ఎంతోకొంత మేలు జరుగుతుందని అతడి తపన. అందుకే ప్రపంచకప్‌ గెలిచే వరకు పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాడు. 
(చదవండి: ధోనికి ఇచ్చే గౌరవం ఇదేనా: అఫ్రిది)


చిన్న వయసులో ఎన్నో ఘనతలు...
రషీద్‌ ఖాన్‌కు ఇప్పుడు 22 ఏళ్లు. తక్కువ సమయంలో తన కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్‌డే మ్యాచుల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన ఘనత అతడిదే. చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టీ20ల్లో కూడా వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత అతడి సొంతం. 2019లో ఐసీసీ ప్రకటించిన టాప్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి ర్యాంకు సాధించాడు. అంతేకాదు చిన్న వయసులో (19) ఒక అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహించిన ఆటగాడిగా గుర్తుంపు పొందాడు. 

ఐపీఎల్‌తో గుర్తింపు...
2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ ద్వారా తన అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తుంపు వచ్చింది మాత్రం ఐపీఎల్‌ వల్లనే. 2017 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరపున ఆడాడు. తన స్పిన్‌ మాయాజాలంతో మేటి బ్యాట్స్‌మెన్స్‌ను సైతం ముప్పుతిప్పలు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. మన దేశంలో కూడా అతడికి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. 
 (చదవండి: హెలికాప్టర్‌ షాట్‌ ఇరగదీశాడుగా..!) 

మరిన్ని వార్తలు