IPL 2023: అయ్యర్‌ దూరం.. కేకేఆర్‌ కెప్టెన్‌ అతడేనా..?

27 Mar, 2023 15:52 IST|Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరమైన సంగతి తెలిసిందే. అయ్యర్‌ గత కొంత కాలంగా వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న అయ్యర్‌.. మూడో టెస్టుకు జట్టుతో కలిశాడు. అయితే అహ్మదాబాద్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఆఖరి టెస్టులో అయ్యర్‌ గాయం మళ్లీ తిరిగి బెట్టింది.

దీంతో అతడు నాలుగో టెస్టులో బ్యాటింగ్‌ కూడా రాలేదు. ఈ క్రమంలో అతడు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా తన వెన్నుముక సంబంధిత సమస్యకు సర్జరీ చేయించుకోవాలని అయ్యర్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీ  వైద్య బృందం సూచించింది. ఒక వేళ సర్జరీ జరిగితే అతడు దాదాపు ఏడాది వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది.

అదే విధంగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుండంతో అయ్యర్‌ ఎన్సీఏ సలహాను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే అయ్యర్‌ ప్రస్తుతం డాక్టర్ల సలహా మెరకు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏదిఏమైనప్పటికీ అయ్యర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌కు మాత్రం దూరంగా ఉండనున్నాడు.

కేకేఆర్‌ కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్.. 
ఇక ఈ ఏడాది సీజన్‌కు అయ్యర్‌ దూరం కావడంతో కేకేఆర్‌ తమ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే పనిలో పడింది. కేకేఆర్‌ కెప్టెన్సీ రేసులో ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ ఉన్నారు. అయితే టైమ్స్‌ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం.. కేకేఆర్‌ జట్టు మేనెజ్‌మెంట్‌ శార్దూల్ ఠాకూర్ వైపు మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్‌-2023 మినీ వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి ట్రేడింగ్‌ ద్వారా శార్దూల్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది.

మరోవైపు యూఏఈ టీ20లీగ్‌లో కేకేఆర్‌ ఫ్రాంచైజీ అబుదాబి నైట్‌రైడర్స్‌ కు సారథ్యం వహించిన సునీల్ నరైన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు కెప్టెన్సీలోని నైట్‌రైడర్స్‌ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.

దీంతో నరైన్‌ను కాదని శార్దూల్‌కే తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్‌ దృఢ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ కొత్త కెప్టెన్‌ పేరును ఒకట్రెండు రోజుల్లో కేకేఆర్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేకేఆర్‌ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌1న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. 
చదవండి: BCCI: భువనేశ్వర్‌కు బిగ్‌ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే!

>
మరిన్ని వార్తలు