Ind Vs Aus: తిల‌క్ వ‌ర్మ అవుట్‌.. విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ ఎంట్రీ!

29 Nov, 2023 19:50 IST|Sakshi

గువాహ‌టిలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఫ‌లితాన్ని తేల్చేయాల‌ని భావించిన టీమిండియాకు చేదు అనుభ‌వం ఎదురైంది. మూడో మ్యాచ్‌లో బ్యాట‌ర్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. బౌల‌ర్ల వైఫ‌ల్యం కార‌ణంగా ఐదు వికెట్ల తేడాతో ఓట‌మిపాలైంది.

ఈ క్ర‌మంలో వ‌రుస‌గా రెండు టీ20లు గెలిచిన సూర్య సేన జోరుకు బ్రేక్ ప‌డింది. దీంతో త‌దుప‌రి మ్యాచ్ టీమిండియాకు స‌వాలుగా మారింది.  రాయ్‌పూర్‌లోనే ఆసీస్‌ను నిలువ‌రించ‌క‌పోతే మూల్యం చెల్లించే ప‌రిస్థితి త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో నాలుగో టీ20లో వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆగ‌మ‌నం దాదాపుగా ఖాయ‌మైపోయింది. కీల‌క మ్యాచ్‌లో ఈ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ తుదిజ‌ట్టులో త‌ప్ప‌క ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక అయ్య‌ర్ రాక‌తో హైద‌రాబాదీ స్టార్ తిల‌క్ వ‌ర్మ‌పై వేటు ప‌డ‌నుంది.

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడు మ్యాచ్‌ల‌లో ఈ లెఫ్టాండ‌ర్‌కు చోటు ద‌క్కింది. వైజాగ్‌లో 12 ప‌రుగులు చేసిన తిల‌క్‌.. తిరువ‌నంత‌పురంలో 7, గువాహ‌టిలో 31 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.  అయితే, త‌న బ్యాట్ నుంచి ఇప్ప‌టిదాకా జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డే ఇన్నింగ్స్ మాత్రం రాలేదు.

ఈ నేప‌థ్యంలో నాలుగో నంబ‌ర్‌లో బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఐదో స్థానంలో ఆడ‌నుండ‌గా.. అయ్య‌ర్ సూర్య ప్లేస్‌ను భ‌ర్తీ చేయ‌నున్నాడు. దీంతో అయ్య‌ర్ రాక‌తో తిల‌క్ త‌న స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. కాగా వ‌న్డే ప్రపంచ‌క‌ప్‌-2023లో అయ్య‌ర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 530 ప‌రుగులు రాబ‌ట్టిన ఈ మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత విశ్రాంతి తీసుకున్నాడు.

ఇక మూడో టీ20లో ధారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న పేస‌ర్ ప్ర‌సిద్ క్రిష్ణ, ఆవేశ్ ఖాన్‌ల‌పై శుక్ర‌వారం నాటి మ్యాచ్‌ సంద‌ర్భంగా వేటు ప‌డ‌టం  ఖాయంగా క‌నిపిస్తోంది.  వీరి స్థానంలో కొత్త పెళ్లి కొడుకు ముకేశ్ కుమార్‌, దీప‌క్ చ‌హ‌ర్ తుదిజ‌ట్టులోకి రానున్న‌ట్లు స‌మాచారం.

చ‌ద‌వండి: వ‌ర‌ల్డ్ క‌ప్ ముందుంది.. బీసీసీఐ నిర్ణ‌యం స‌రైంది: గంభీర్‌

మరిన్ని వార్తలు