‘నయీ దిల్లీ’కి మరో చాన్స్‌

8 Apr, 2021 04:45 IST|Sakshi
ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌

తొలి టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఢిల్లీ క్యాపిటల్స్‌

అన్ని రకాలుగా జట్టు పటిష్టం  

రెండేళ్ల క్రితం డేర్‌డెవిల్స్‌ను వదిలి క్యాపిటల్స్‌ అంటూ పేరు మార్చుకొని వచ్చిన ఢిల్లీ నిజంగా కొత్తగా కనిపించింది. అప్పటి వరకు ఆరు సీజన్ల పాటు వరుసగా 9, 8, 7, 6, 6, 8 స్థానాల్లో నిలిచి ఇదేం టీమ్‌రా బాబూ అంటూ సొంత అభిమానులే జట్టు ప్రదర్శనతో విసుగెత్తిపోయేలా చేసింది. ఇలాంటి స్థితిలో కొత్త కోచ్, కొత్త కెప్టెన్‌ నేతృత్వంలో 2019లో మూడో స్థానంలో నిలిచిన టీమ్‌ ఏడాది తిరిగేసరికి మరో మెట్టు ఎక్కింది.

‘నయీ దిల్లీ’ అంటూ ఫైనల్‌ వరకు చేరి సత్తా చాటింది. లీగ్‌ దశలో చాలా బాగా ఆడినా... దురదృష్టవశాత్తూ రెండో స్థానానికే పరిమితమైన టీమ్‌ ఇప్పుడు ఆ అడ్డంకిని దాటి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. కొత్త కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ నాయకత్వ ప్రదర్శన... అన్నీ తానే అయి వ్యవహరించే కోచ్‌ రికీ పాంటింగ్‌ వ్యూహాలు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తొలి టైటిల్‌ కలను నెరవేరుస్తాయా అనేది ఆసక్తికరం.

కొత్తగా వచ్చినవారు...
వేలంపరంగా చూస్తే ఢిల్లీ ఎంపిక అంత గొప్పగా ఏమీ లేదు. ఫామ్‌ను బట్టి రబడ, నోర్జేలు ఖాయంగా తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న చోట మరో విదేశీ పేసర్‌ టామ్‌ కరన్‌ (రూ. 5.25 కోట్లు«) కోసం భారీ మొత్తం వెచ్చించింది. అదే విధంగా ఎన్ని మ్యాచ్‌లలో తుది జట్టులో ఉంటాడో తెలియని స్టీవ్‌ స్మిత్‌ (రూ.2.20)ను అందరికంటే ముందు ఎంచుకుంది. భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ (రూ. 1 కోటి) ఎంపిక సరైంది కాగా... ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా లివింగ్‌స్టోన్‌ (రూ. 2 కోట్లు) తీసుకుంది. మరో నలుగురు యువ ఆటగాళ్లు రిపాల్‌ పటేల్, విష్ణు వినోద్, లుక్మాన్‌ మేరివాలా, ఎం. సిద్ధార్థ్‌లను రూ. 20 లక్షల కనీస ధరకే సొంతం చేసుకుంది.  

తుది జట్టు అంచనా/ఫామ్‌
గత ఏడాది ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా జట్టును సమర్థంగా నడిపించిన శ్రేయస్‌ అయ్యర్‌ లేకపోవడం టీమ్‌కు పెద్ద లోటు. అతని స్థానంలో అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు రహానే మినహా (గత సీజన్‌లో టీమ్‌ 17 మ్యాచ్‌లు ఆడితే రహానేకు 9 మ్యాచ్‌లలోనే చాన్స్‌ లభించింది) మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. నలుగురు విదేశీ ఆటగాళ్ల జాబితాను చూస్తే రబడ, నోర్జే ఖాయం. ఆల్‌రౌండర్‌గా స్టొయినిస్‌ లేదా అతనికి ప్రత్యామ్నాయంగా సరిగ్గా అలాంటి శైలి ఉన్న వోక్స్‌ అందుబాటులో ఉన్నాడు. మిగిలిన మరో స్థానంలో హిట్టర్‌ హెట్‌మైర్‌ను కాదని స్మిత్‌కు ఎన్ని మ్యాచ్‌లు దక్కుతాయో చూడాలి. ఆటగాడికంటే స్మిత్‌ మెంటార్‌ పాత్రనే ఎక్కువగా పోషించేటట్లు కనిపిస్తోంది.

గత సీజన్‌లో 3 మ్యాచ్‌లకు దూరమైన పంత్‌... ఇప్పుడు కెప్టెన్‌ కాబట్టి అన్ని మ్యాచ్‌లు ఆడతాడనడంలో సందేహం లేదు. భారత పేస్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లాంటి సీనియర్లు అందుబాటులో ఉండగా, అవేశ్‌ ఖాన్‌కు కొన్ని మ్యాచ్‌లు దక్కవచ్చు. స్పిన్‌లో మరోసారి అశ్విన్, అక్షర్‌ ద్వయం ప్రత్యర్థులను దెబ్బ తీయగలదు. సీనియర్‌ లెగ్‌స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కూడా అందుబాటులో ఉన్నాడు. పెద్దగా మార్పులు లేకుండా గత సీజన్‌లో ఆడిన తుది జట్టే ఈసారి కూడా ఎక్కువగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అన్నింటికి మించి ఇటీవలి అద్భుత ఫామ్, పెరిగిన ఆత్మవిశ్వాసంతో పంత్‌ నాయకుడిగా మైదానంలో ఎలా జట్టు నడిపిస్తాడనేది ఆసక్తికరం.

జట్టు వివరాలు
భారత ఆటగాళ్లు: రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), అజింక్య రహానే, రవిచంద్రన్‌ అశ్విన్, ఎం.సిద్ధార్థ్, విష్ణు వినోద్, లలిత్‌ యాదవ్, అవేశ్‌ ఖాన్, అక్షర్‌ పటేల్, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ, రిపాల్‌ పటేల్, శిఖర్‌ ధావన్, ప్రవీణ్‌ దూబే, పృథ్వీ షా, ఉమేశ్‌ యాదవ్, లుక్మాన్‌ మేరివాలా.

విదేశీ ఆటగాళ్లు: కగిసో రబడ, స్టొయినిస్, స్యామ్‌ బిల్లింగ్స్, క్రిస్‌ వోక్స్, స్టీవ్‌ స్మిత్, హెట్‌ మైర్, నోర్జే, టామ్‌ కరన్‌.
సహాయక సిబ్బంది: రికీ పాంటింగ్‌ (కోచ్‌), మొహమ్మద్‌ కైఫ్‌ (అసిస్టెంట్‌ కోచ్‌), ప్రవీణ్‌ ఆమ్రే (అసిస్టెంట్‌ కోచ్‌), అజయ్‌ రాత్రా (అసిస్టెంట్‌ కోచ్‌), జేమ్స్‌ హోప్స్‌ (పేస్‌ బౌలింగ్‌ కోచ్‌).

అత్యుత్తమ ప్రదర్శన
2020లో రన్నరప్‌
2020లో ప్రదర్శన: 14 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించి రెండో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే లీగ్‌ దశలో రెండు సార్లు, ఆపై తొలి క్వాలిఫయర్, ఫైనల్లో కూడా ముంబై ఇండియన్స్‌ చేతిలోనే ఓడి తొలి టైటిల్‌కు దూరమైంది. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ (619 పరుగులు), శ్రేయస్‌ అయ్యర్‌ (519) కీలక పాత్ర పోషించగా... రబడ, నోర్జే కలిసి 52 వికెట్లు పడగొట్టారు. అక్షర్, స్టొయినిస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కూడా జట్టుకు విజయాలు అందించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు