ఆ పార్టీలకు ఓటు అడిగే హక్కులేదు

8 Apr, 2021 04:50 IST|Sakshi
సి.రామచంద్రయ్యను సత్కరిస్తున్న కాపు నేతలు

ఎమ్మెల్సీ రామచంద్రయ్య

తిరుపతి తుడా: తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీతో పాటు ఆయన జంటపక్షులు పవన్, చంద్రబాబు పోటీపడి ప్రకటించి రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ముంచారని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. తిరుపతిలో బుధవారం కాపు/బలిజ నేతలతో సమావేశమైన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించుకుందామని వారికి సూచించారు. చంద్రబాబు బలిజల్ని ఓటు బ్యాంక్‌గా చూసి ఇన్నాళ్లు మాయమాటలతో మోసగించారని చెప్పారు. అధికారంలో ఉన్నన్నాళ్లు బలిజలు చంద్రబాబుకు గుర్తురారన్నారు.

ఉప ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎవరు ఓటేసినా అది బూడిదలో పోసిన పన్నీరులా వృధా అవుతుందన్నారు. ప్రత్యేక హోదా నినాదం బలపడాలన్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన నినాదం నిలవాలన్నా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఉండాలని చెప్పారు. తనది కమ్యూనిస్ట్‌ సిద్ధాంతమని చెప్పుకొనే పవన్‌కల్యాణ్‌ బీజేపీతో కలవడం సిగ్గుచేటన్నారు. ఈ పార్టీలకు ఓట్లు అడిగే హక్కులేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీని బలపరిచి ఫ్యాన్‌గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఆయన గత 3 రోజులుగా నియోజకవర్గాల వారీ బలిజ నేతలతో సమావేశమవుతున్నారు. నైనారు శ్రీనివాసులు, మురళి, జయకృష్ణ, రవి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో నేతలు రామచంద్రయ్యను సత్కరించారు. 

మరిన్ని వార్తలు