#Rohit Sharma: చిత్తుగా ఓడిన ఎంఐ.. హార్దిక్‌పై మండిపడ్డ రోహిత్‌, ఆకాశ్‌ అంబానీ!

28 Mar, 2024 16:58 IST|Sakshi
హార్దిక్‌పై మండిపడ్డ రోహిత్‌, ఆకాశ్‌ అంబానీ! (PC: Jio Cinema)

ఐపీఎల్‌-2024లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది ముంబై ఇండియన్స్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే ఏ దశలోనూ కట్టడి చేయలేక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది.

ముఖ్యంగా ట్రవిస్‌ హెడ్‌(24 బంతుల్లో 62), అభిషేక్‌ శర్మ(23 బంతుల్లో 63), మార్క్రమ్‌(28 బంతుల్లో 42 నాటౌట్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌(34 బంతుల్లో 80 నాటౌట్‌) ఊచకోతకు అడ్డుకట్ట వేయలేక ముంబై బౌలర్లు చేతులెత్తేయగా.. ఆ జట్టు అభిమానులతో పాటు యజమానులు కూడా తలలు పట్టుకున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమికి పాండ్యా కెప్టెన్సీనే కారణమనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్‌-2024లో రోహిత్‌ శర్మను కాదని హార్దిక్‌ను సారథిగా నియమించినందుకు ముంబై ఇండియన్స్‌ ఫలితం అనుభవిస్తోందని నెట్టింట ట్రోల్స్‌ వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఓ ఫొటో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతోంది. ఇందులో రోహిత్‌ శర్మతో పాటు.. ఎంఐ యజమాని ఆకాశ్‌ అంబానీ.. హార్దిక్‌ పాండ్యాతో సీరియస్‌గా మాట్లాడుతూ ఉన్నట్లు కనిపిస్తోంది. అనంతరం.. రోహిత్‌.. ఆకాశ్‌తో చర్చలు జరిపినట్లు కనిపించింది. 

ఇది చూసిన నెటిజన్లు..‘‘పాండ్యాకు బాగా బుద్ధి చెప్పినట్లున్నారు. ఇప్పటికైనా అంబానీలు తమ కెప్టెన్‌ను మారుస్తారేమో చూడాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌ను సారథిగా ఉన్న పాండ్యాను ముంబై భారీ ధరకు ట్రేడ్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో.. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మను కాదని.. పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, ముంబై ఫ్యాన్స్‌ కూడా ఇంత వరకు హార్దిక్‌ను కెప్టెన్‌గా అంగీకరించడం లేదు. ఎక్కడికి వెళ్లినా రోహిత్‌ నామస్మరణతో పాండ్యాను టీజ్‌ చేస్తూ.. ఒక్కోసారి విపరీతపు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

ఇక మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు పాండ్యా తొలుత గుజరాత్‌ టైటాన్స్‌తో.. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఓటమి పాలయ్యాడు. దీంతో పాండ్యాను వెంటనే కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ సొంత జట్టు అభిమానులే డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం.

Election 2024

మరిన్ని వార్తలు