నువ్వా.. నేనా..!

6 Nov, 2020 05:28 IST|Sakshi

నేడు ఐపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌

బెంగళూరుతో హైదరాబాద్‌ ఢీ  

ఓడిన జట్టు ఇంటికి గెలిస్తే రెండో క్వాలిఫయర్‌ అవకాశం

సా.గం. 7.30నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో గత మూడు మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించింది... మరో వైపు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తాము ఆడిన గత నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఇరు జట్ల తాజా ప్రదర్శనను ఇది చూపిస్తోంది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు లీగ్‌నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు మాత్రం ఫైనల్‌ చేరేందుకు ఆదివారం ఢిల్లీతో జరిగే రెండో క్వాలిఫయర్‌ ద్వారా మరో అవకాశం ఉంటుంది.  

జోరు కొనసాగిస్తారా...
టోర్నీ ఆరంభంలో తడబడినా...ఇప్పుడు సన్‌రైజర్స్‌ తుది జట్టు కూర్పు సరిగ్గా కుదిరిందని తాజా విజయాలు చూపించాయి. అనూహ్యంగా ఓపెనింగ్‌ అవకాశం దక్కించుకున్న సాహా చెలరేగుతుండటంతో మరో ఓపెనర్‌ వార్నర్‌పై భారం తగ్గింది. వీరిద్దరు మరోసారి శుభారంభం అందిస్తే రైజర్స్‌ భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. వీరితో పాటు మిడిలార్డర్‌లో పాండే, విలియమ్సన్, సమద్‌ బాధ్యతగా ఆడాల్సి ఉంది. తుది జట్టులో అభిషేక్, గార్గ్‌లలో ఒకరికి అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ రాకతో కూడా హైదరాబాద్‌ బలం పెరిగింది. రషీద్, నదీమ్‌ స్పిన్‌ కీలకం కానుండగా...సందీప్‌ శర్మ మరోసారి చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు.  

కోహ్లి సత్తా చాటేనా...
అదృష్టవశాత్తూ రన్‌రేట్‌ సహకారంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా బెంగళూరు పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. నాలుగు వరుస ఓటములు అంటే ఆందోళనకరమైన అంశమే. డివిలియర్స్‌పై అతిగా ఆధాపడుతుండటం, కోహ్లి తన స్థాయికి తగినట్లుగా ఆడకపోవడం కూడా జట్టును దెబ్బ తీస్తోంది. ఇప్పటి వరకు పడిక్కల్‌ ఒక్కడే నిలకడైన ప్రదర్శన చేశాడు. ఒక్కసారి ఏబీ, కోహ్లిలను అవుట్‌ చేస్తే పతనం మొదలైపోతుందని లీగ్‌లో ఇప్పటికే నిరూపితమైంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు సుందర్, చహల్‌ కీలకం కానున్నారు. జట్టును గాయాలు కూడా వేధిస్తున్నాయి. మోరిస్, సైనీ పూర్తిగా కోలుకోలేదు. సిరాజ్‌నుంచి జట్టు మరో చక్కటి ప్రదర్శన ఆశిస్తోంది.  

టాస్‌ కీలకం...
అబుదాబిలో టాస్‌ మరోసారి కీలకంగా మారింది. ఇక్కడ గత ఐదు మ్యాచ్‌లో రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. మంచు కారణంగా అన్ని జట్లు ఛేదనకే మొగ్గు చూపుతున్నాయి.  

ముఖాముఖీ  
ఐపీఎల్‌–2020లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో చెరో విజయం నమోదు చేసుకున్నాయి. తొలి పోరులో బెంగళూరు 10 పరుగులతో గెలవగా, తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 5 వికెట్లతో నెగ్గింది.  
గురువారం పుట్టిన రోజు
వేడుకలో కోహ్లి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు