మరీ ఇంత దారుణ వైఫల్యమా? నీలాంటి ‘కెప్టెన్‌’ ఈ భూమ్మీద మరొకరు ఉండరు! మ్యాచ్‌ గెలిచినా..

27 Oct, 2022 12:19 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 - South Africa vs Bangladesh- Sidney: టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా వైఫల్యం కొనసాగుతోంది. ప్రపంచకప్‌-2022లో భాగంగా సిడ్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. కాగా గత కొంతకాలంగా పొట్టి క్రికెట్‌లో బవుమా పూర్తిగా తేలిపోతున్న సంగతి తెలిసిందే.

దారుణ ప్రదర్శన
గత ఏడు ఇన్నింగ్స్‌లో టీ20 ఫార్మాట్‌లో బవుమా చేసిన పరుగులు వరుసగా... 8, 8*, 0, 0, 3, 2*, 2. అంతేకాదు మొత్తంగా ఇప్పటి వరకు 31 అంతర్జాతీయ టీ20లు ఆడిన బవుమా సాధించిన పరుగులు 571. అత్యధిక స్కోరు 72. హాఫ్‌ సెంచరీ ఒకటి. 

ఇక వన్డేల్లోనూ 20 మ్యాచ్‌లలో అతడు సాధించిన పరుగులు 730. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో బవుమా అత్యధిక స్కోరు 113. టెస్టుల విషయానికొస్తే 51 మ్యాచ్‌లలో 2612 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 19 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

నువ్వు కెప్టెన్‌ కదా!
కాగా బంగ్లాతో మ్యాచ్‌లో బవుమా మరోసారి నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ అతడిని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘బవుమా అద్భుత ఫామ్‌ కొనసాగుతోంది. సూపర్‌గా ఆడుతున్నాడు. 31 అంతర్జాతీయ టీ20లలో ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ.. వరుసగా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు.. 

సారథిగా భేష్‌.. అయినా పాపం
ఇంత ఘోరంగా ఆడే ఓ క్రికెటర్‌ ఈ భూమ్మీద కెప్టెన్‌గా ఉండగలడా?’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, బ్యాటర్‌గా విఫలమవుతున్నా టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు 20 మ్యాచ్‌లకు టీ20లకు సారథిగా వ్యవహరించిన బవుమా.. 13 గెలిచాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అతడి అభిమానులు ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు.

ఇక బంగ్లాతో మ్యాచ్‌లో రిలీ రోసో, క్వింటన్‌ డికాక్‌ రాణించడంతో సహా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనరచడంతో బవుమా బృందం 104 పరుగుల భారీ తేడాతో గెలిచింది. కాగా గతేడాది కెప్టెన్సీ చేపట్టిన బవుమా.. ఈ ఘనత సాధించిన తొలి బ్లాక్‌ ఆఫ్రికన్‌గా చరిత్రకెక్కాడు.

చదవండి: Rilee Rossouw: అద్భుత సెంచరీతో రికార్డులు సృష్టించిన రోసో.. అరుదైన ఘనతలు
టీ20 వరల్డ్‌కప్‌లో సెంచరీ హీరోలు వీరే.. భారత్‌ నుంచి ఒకే ఒక్కడు

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు