Serena Williams: న్యూయార్క్‌ టైమ్స్‌ చెంప చెల్లుమనిపించిన సెరెనా విలియమ్స్‌

3 Mar, 2022 12:46 IST|Sakshi

టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక వార్త విషయంలో సెరెనా ఫోటోను ప్రచురించకుండా.. తన అక్క వీనస్‌ విలియమ్స్‌ ఫోటోను ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న సెరెనా విలియమ్స్‌ న్యూయార్క్‌ టైమ్స్‌కు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చింది. విషయంలోకి వెళితే.. 40 ఏళ్ల టెన్నిస్‌ స్టార్‌ ఈ మధ్యనే సెరెనా వెంచర్స్‌ పేరుతో  క్యాపిటల్‌ వెంచర్స్‌ను ప్రారంభించింది. దాదాపు 111 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిధిని సేకరించింది. ఇదే విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడిస్తూ సెరెనాపై ఒక ఆర్టికల్‌ రాసుకొచ్చింది. 

విషయం సరిగ్గానే ఉన్నప్పటికి ఫోటో విషయంలో మాత్రం పెద్ద పొరపాటే చేసింది. సెరెనా ఫోటోకు బదులు తన అక్క వీనస్‌ విలియమ్స్‌ ఫోటోను ప్రచురించింది. యుక్త వయసులో సెరెనా, వీనస్‌లు దాదాపు ఒకే రకంగా ఉండేవారు.  అప్పటి సెరెనా అనుకొని.. వీనస్‌ ఫోటోను పబ్లిష్‌ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఆర్టికల్‌తో పాటు ఫోటోను ట్యాగ్‌ చేస్తూ సెరెనాకు పంపించారు. ఇది చూసిన సెరెనా స్పందించింది.

''జీవితంలో చాలా సాధించినప్పటికి ఏదో తెలియని వెలితి. అందుకే సెరెనా వెంచర్స్‌ పేరుతో క్యాపిటల్‌ వెంచర్‌ను ప్రారంభించాం. దానిపై దాదాపు 111 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల నిధిని సేకరించాం.  సంస్థను నెలకొల్పిన వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు వ్యవస్థ సాయపడుతోంది. ఇదే విషయాన్ని ఒక పత్రిక ఆర్టికల్‌ రూపంలో రాసుకొచ్చింది. కానీ ఫోటో మాత్రం వేరొకరిది పెట్టింది. మా అక్క ఫోటో వాడడం తప్పు కాదు.. కానీ ఫోటో వేసేముందు ఒకసారి తీక్షణంగా పరిశీలిస్తే బాగుంటుంది. ఫోటోను పెట్టారు సరే.. కానీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. మీ పరిశోధన సరిపోలేదు..'' అంటూ రాసుకొచ్చింది.

ఇక మహిళల టెన్నిస్‌ విభాగంలో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన సెరెనా ఇటీవలే పెద్దగా ఆడడం లేదు. ఈ మధ్యనే విడుదలైన ర్యాంకింగ్స్‌లో 2006 తర్వాత తొలిసారి టాప్‌ 50లో సెరెనా చోటు దక్కించుకోలేకపోయింది. 2021 నుంచి చూసుకుంటే సెరెనా కేవలం ఆరు టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొంది. వింబుల్డన్‌ టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన సెరెనా.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి ఫిట్‌నెస్‌ కారణాలతో తప్పుకుంది. 

చదవండి: Novak Djokovic: నెంబర్‌ వన్‌ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన జొకోవిచ్‌

Ranji Trophy 2022: తొమ్మిదేళ్ల తర్వాత తొలి వికెట్‌ పడగొట్టాడు.. ఒక్కసారిగా ఏం చేశాడంటే..!

మరిన్ని వార్తలు