Shoaib Akthar Emotional Video: 11 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ.. ఎట్టకేలకు

9 Aug, 2022 12:46 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఎమెషనల్‌ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇటీవలే మోకాలి సర్జరీ కోసం అక్తర్‌ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. మెల్‌బోర్న్‌లోని ఒక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న అక్తర్‌ కోలుకుంటున్నాడు. కాగా అక్తర్‌ గత 11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఒక రకంగా అక్తర్‌ క్రికెట్‌ నుంచి వైదొలగడానికి పరోక్షంగా ఇది కూడా ఒక కారణం. మొత్తానికి ఇన్నేళ్లకు మోకాలీ సర్జరీ చేయించుకున్న అక్తర్‌ కాస్త రిలీఫ్‌ అయ్యాడు. 

ఈ సందర్భంగా అక్తర్‌ మాట్లాడుతూ..  ''11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నా. వాస్తవానికి క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే మోకాలి నొప్పితో మరో నాలుగైదేళ్లు ఆడి ఉంటే మాత్రం  కచ్చితంగా వీల్‌చైర్‌కు పరిమితమయ్యేవాడిని. ఎలాగోలా ఇన్నేళ్లకు సర్జరీ చేయించుకున్నా. కాస్త నొప్పిగా ఉంది. మీ ప్రార్థనలు నేను తొందరగా కోలుకునేలా చేస్తాయని ఆశిస్తున్నా. ఇదే నా చివరి సర్జరీ కూడా కావాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ప్రస్తుతం షోయబ్‌ అక్తర్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక షోయబ్‌ అక్తర్‌ పాకిస్తాన్‌ తరపున  అన్ని ఫార్మాట్లు కలిపి 224 మ్యాచ్‌లాడి 444 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: Kieron Pollard: చరిత్ర సృష్టించిన కీరన్‌ పొలార్డ్‌.. ఎవరికి అందనంత ఎత్తులో

మరిన్ని వార్తలు