CWC 2023: ఆ వ్యాఖ్యలు పాంటింగ్‌ చేసినవేనా?

20 Nov, 2023 16:07 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమి నేపథ్యంలో బీసీసీఐపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.

పాంటింగ్‌ ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడుతూ బీసీసీఐని క్రికెట్‌ మాఫియాతో పోల్చాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అయితే పాంటింగ్‌ నిజంగా ఈ వ్యాఖ్యలు చేశాడా లేదా అని ఫ్యాక్ట్‌ చేయగా.. ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తేలింది. ఈ ప్రచారంపై భారత్‌లోనే ఉన్న పాంటింగ్‌ స్పందించాల్సి ఉంది. 

కాగా, ASG అనే ట్విటర్‌ అకౌంట్‌ నుంచి పాంటింగ్‌ ఫాక్స్‌ క్రికెట్‌తో మాట్లాడుతూ బీసీసీఐపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.

సదరు ట్వీట్‌లో ఏముందంటే.. ఇది క్రికెట్ మాఫియాపై (బీసీసీఐని ఉద్దేశిస్తూ) న్యాయం సాధించిన విజయం.. డబ్బు, పలుకుబడితో ప్రపంచ కప్ గెలవలేరని పాంటింగ్‌ అన్నట్లు ప్రచారం​ జరుగుతుంది. పాంటింగ్‌ నిజంగానే బీసీసీఐని అలా అన్నాడనుకుని పొరబడ్డ కొందరు భారత క్రికెట్‌ అభిమానులు పాంటింగ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఐపీఎల్‌లో పిలిచి పెత్తనం ఇచ్చినందుకు (ఢిల్లీ క్యాపిటల్స్‌) బీసీసీఐకి సరైన గుణపాఠమే నేర్పాడని కామెంట్లు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్‌ హెడ్‌ (137), లబూషేన్‌ (58 నాటౌట్‌) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్‌-లబూషేన్‌ జోడీ నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (47), విరాట్‌ కోహ్లి (54), కేఎల్‌ రాహుల్‌ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్‌ బౌలర్లు స్టార్క్‌ (3/55), హాజిల్‌వుడ్‌ (2/60), కమిన్స్‌ (2/34), మ్యాక్స్‌వెల్‌ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. 

మరిన్ని వార్తలు