#Babar Azam: అయ్యో.. జస్ట్‌ 87 పరుగులతో సెంచరీ మిస్‌! ఆ బాధ వర్ణణాతీతం

17 Jul, 2023 19:07 IST|Sakshi

Sri Lanka vs Pakistan, 1st Test- Babar Azam Failed: శ్రీలంకతో మొదటి టెస్టులో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియా వేదికగా మీమ్స్‌, ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు.

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడే నిమిత్తం పాకిస్తాన్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం (జూలై 16) తొలి మ్యాచ్‌ ఆరంభమైంది. గాలే వేదికగా జరుగుతున్న టెస్టులో టాస్‌ గెలిచిన ఆతిథ్య లంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

డి సిల్వ సూపర్‌ సెంచరీ
అయితే, పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది ఆరంభంలోనే దిముత్‌ కరుణరత్నె బృందానికి షాకిచ్చాడు. ఓపెనర్లు మధుష్క(4), కరుణరత్నె(29)లతో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌(12)ను త్వరగా పెవిలియన్‌కు పంపాడు.

ఇలా కష్టాల్లో కూరుకుపోయిన జట్టును నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాథ్యూస్‌ (64), ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధనుంజయ డి సిల్వా(122) ఆదుకున్నారు.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సమరవిక్రమ(36) తన వంతు సహకారం అందించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 312 పరుగులు చేయగలిగింది. ఇక బ్యాటింగ్‌ మొదలెట్టిన పాకిస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు అబుల్లా షఫీక్‌(19)ను ప్రభాత్‌ జయసూర్య, ఇమామ్‌ ఉల్‌ హక్‌(1)ను కసున్‌ రజిత అవుట్‌ చేశారు.

జస్ట్‌ 87 పరుగులతో సెంచరీ మిస్‌ అంటూ సెటైర్లు
వన్‌డౌన్లో వచ్చి నిలదొక్కుకున్న షాన్‌ మసూద్‌(39)ను మెండిస్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన బాబర్‌ ఆజం పూర్తిగా తేలిపోయాడు. ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లో సమరవిక్రమకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో అతడిని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘అయ్యో.. జస్ట్‌ 87 పరుగులతో బాబర్‌ ఆజం సెంచరీ మిస్‌ అయ్యాడు. ఈ జింబాబర్‌ పాక్‌లో ఉండే రోడ్‌పిచ్‌లు అనుకుని పొరపాటు పడ్డాడు’’ అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.

ఇక టాపార్డర్‌ విఫలం కావడంతో సౌద్‌ షకీల్‌ (69- నాటౌట్‌), అఘా సల్మాన్‌ (61- నాటౌట్‌) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ కారణంగా సోమవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి పాకిస్తాన్‌ 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

శ్రీలంక వర్సెస్‌ పాకిస్తాన్‌ తొలి టెస్టు తుది జట్లు:
శ్రీలంక

దిముత్ కరుణరత్నే (కెప్టెన్), నిషాన్ మదుష్క, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, దినేష్ చండిమాల్, సదీర సమరవిక్రమ (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, ప్రభాత్‌ జయసూర్య, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత.

పాకిస్తాన్‌
అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్ (కెప్టెన్), సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, నౌమాన్ అలీ, అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా.

చదవండి: కోహ్లి, రాహుల్‌, హార్దిక్‌.. వీళ్లెవరూ కాదు! సౌత్‌ హీరోయిన్‌ను పెళ్లాడిన క్రికెటర్‌?
టీమిండియా కొత్త కెప్టెన్‌ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా..
‘సెహ్వాగ్‌ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’

మరిన్ని వార్తలు