బాబర్‌ ఆజమ్‌ ‘శకం’ ముగిసింది.. నయా నంబర్‌ వన్‌ శుభ్‌మన్‌ గిల్‌

8 Nov, 2023 14:26 IST|Sakshi

రెండేళ్ల కాలంలో ఎవరు చేయలేని పనిని టీమిండియా యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌ చేసి చూపించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను ఎట్టకేలకు కిందికి దించాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ అగ్రస్థానాని​కి ఎగబాకి, బాబర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 219 పరుగులు చేసిన గిల్‌.. బాబర్‌ కంటే ఆరు రేటింగ్‌ పాయింట్లు (830) అధికంగా సాధించి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. సచిన్‌, ధోని, కోహ్లి తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌కు చేరిన భారత బ్యాటర్‌ గిలే కావడం విశేషం.  

తాజా ర్యాంకింగ్స్‌లో గిల్‌తో పాటు విరాట్‌ కోహ్లి కూడా తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్‌ నాలుగో స్థానానికి ఎగబాకాడు. వరల్డ్‌కప్‌లో ప్రదర్శనల కారణంగా తాజా ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు ఏర్పడింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో భారీగా స్థానచలనాలు జరిగాయి. డికాక్‌ (మూడో స్థానం), శ్రేయస్‌ (18), ఫకర్‌ జమాన్‌ (11), ఇబ్రహీం జద్రాన్‌ (12) తమతమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.

బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్‌-10లో ఏకంగా నలుగురు భారత బౌలర్లు చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టిన మొహమ్మద్‌ సిరాజ్‌ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు, బుమ్రా తొమ్మిది, షమీ పది స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌-10లో గిల్‌, కోహ్లితో పాటు రోహిత్‌ శర్మ (ఆరో స్థానం) కూడా ఉన్నాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా ఎనిమిది విజయాలు సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు