Rashid Latif: బాబర్‌, రిజ్వాన్‌ లాంటి ఆటగాళ్లు లేరని భారతీయులు బాధపడతారు.. పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

19 Dec, 2021 16:17 IST|Sakshi

Rashid Latif Comments On Team India: పాకిస్థాన్‌ మాజీ వికెట్‌కీపర్‌ రషీద్‌ లతీఫ్‌ భారత క్రికెట్‌ అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు లేరని టీమిండియా ఫ్యాన్స్‌ బాధపడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ లతీఫ్‌ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా పాక్‌ పరిమిత ఓవర్ల ఓపెనింగ్‌ జోడీ(బాబర్‌, రిజ్వాన్‌)పై ప్రశంసల వర్షం కురిపించిన లతీఫ్‌.. భారత అభిమానులను తక్కువ చేసి మాట్లాడాడు. 

ఏడాది కిందట పాక్‌ అభిమానులు సైతం తమ జట్టులో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు లేరని బాధపడేవాళ్లని తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో బాబర్‌, రిజ్వాన్‌ ద్వయం తిరుగులేనిదని, ఈ జోడీ మున్ముందు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని జోస్యం చెప్పాడు. తమ దేశ క్రికెటర్లను ఆకాశానికెత్తిన లతీఫ్‌.. విరాట్‌, రోహిత్‌లలో మునుపటి పదను లేదని పేర్కొన్నాడు. లతీఫ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు భగ్గుమంటున్నారు. సోషల్‌మీడియా వేదికగా లతీఫ్‌ను ఓ ఆటాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, గతేడాది కాలంగా పాక్‌ ఓపెనింగ్‌ ద్వయం పొట్టి ఫార్మాట్‌లో మంచినీళ్ల ప్రాయంగా పరుగులు సాధిస్తుంది. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్‌ జోడీగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో భారత టీ20 ఓపెనింగ్‌ జోడీ రోహిత్‌, రాహుల్‌ పేరిట ఉన్న అత్యధిక శతక భాగస్వామ్యాల(6) రికార్డును బద్దలు కొట్టింది. రిజ్వాన్‌ ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 2000 పరుగులు చేయగా.. బాబర్‌ 1600 పైచిలుకు పరుగులు సాధించాడు.
చదవండి: ఒడిశా ఆటగాడికి బంఫర్‌ ఆఫర్‌.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు!

మరిన్ని వార్తలు