Ind vs Pak: వీరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పా.. వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్‌: పాక్‌ మాజీ బౌలర్‌

2 Dec, 2023 14:13 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- జునైద్‌ ఖాన్‌ (PC: X)

#TB- Pakistan in India 2012-13: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌.. 2012-13 నాటి సిరీస్‌.. దాయాది టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌ ఆడేందుకు పాక్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. పాక్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ జునైద్‌ ఖాన్‌కు పునరాగమన సిరీస్‌ అది.

నాటి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని మూడుసార్లూ అతడే అవుట్‌ చేశాడు. తొలి వన్డేలో కోహ్లిని డకౌట్‌ చేసిన జునైద్‌.. రెండో మ్యాచ్‌లో 6 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఇక ఆఖరిదైన ఢిల్లీ మ్యాచ్‌లో 7 పరుగుల వద్ద నిష్క్రమించేలా చేశాడు.

ఎంత మంది వికెట్లు తీసినా కోహ్లి ప్రత్యేకం
అప్పట్లో జరిగిన ఈ సిరీస్‌ను పాకిస్తాన్‌ 2-1తో కైవసం చేసుకుంది. తాజాగా  నాదిర్‌ షా పాడ్‌కాస్ట్‌లో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జునైద్‌ ఖాన్‌ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో ఎంతో మంది బ్యాటర్ల వికెట్లు తీసినప్పటికీ అందరికీ విరాట్‌ కోహ్లి వికెట్‌ మాత్రమే ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు.

అలా కానివ్వనన్నాడు
‘‘అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆడినప్పటి నుంచే మాకు పరిచయం ఉంది. నాకు బాగా గుర్తు. టీమిండియాతో ఆడటం అదే మొదటిసారి. నా కమ్‌బ్యాక్‌ సిరీస్‌ కూడా! మొదటి మ్యాచ్‌లో కోహ్లి వికెట్‌ తీశాను. అప్పుడు అతడు నా దగ్గరకు వచ్చి మరోసారి ఇది పునరావృతం కాదని చెప్పాడు. అయితే, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలోనూ నేను మళ్లీ అతడి వికెట్‌ పడగొట్టాను.

నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పాను
నిజానికి మూడో వన్డేకు ముందు బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ దగ్గర కోహ్లి కలిశాడు. అప్పుడు.. ‘విరూ.. ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు’ అని చెప్పాను. అప్పుడు యూనిస్‌ ఖాన్‌ కూడా అక్కడే ఉన్నాడు. అన్నట్లుగానే నేను కోహ్లిని అవుట్‌ చేశాను. నా బౌలింగ్‌లో అతడు ఇచ్చిన క్యాచ్‌ను యూనిస్‌ భాయ్‌ పట్టాడు’’ అని జునైద్‌ ఖాన్‌ నాటి సిరీస్‌లో కోహ్లితో తనకున్న ‘వైరం’ గురించి చెప్పుకొచ్చాడు.

కోహ్లి వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్‌
అదే సమయంలో కోహ్లిపై ప్రశంసలు కురిపించిన జునైద్‌ ఖాన్‌.. ‘‘ప్రపంచంలోని టాప్‌-5 బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి ఎప్పటికీ నిలిచిపోతాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు అసాధారణ రికార్డులు సాధిస్తున్నాడు.

ఇటీవలే సచిన్‌ టెండుల్కర్‌ వన్డే సెంచరీల రికార్డును కూడా కోహ్లి బద్దలు కొట్టాడు. అతడు వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్‌’’ అని కొనియాడాడు. అయితే, కోహ్లి- సచిన్‌ల కంటే తనకు రోహిత్‌ శర్మనే మెరుగైన బ్యాటర్‌ అనిపిస్తాడంటూ ఆఖర్లో ట్విస్ట్‌ ఇచ్చాడు జునైద్‌ ఖాన్‌. 

అప్పుడు మొత్తం 3 పరుగులిచ్చి మూడుసార్లూ
కాగా పాకిస్తాన్‌ తరఫున 22 టెస్టులు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడిన జునైద్‌ ఖాన్‌.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 71, 110, 8 వికెట్లు తీశాడు. ఇక టీమిండియాతో 2012-13 వన్డే సిరీస్‌లో కోహ్లికి మొత్తంగా 24 బంతులు వేసిన జునైద్‌ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడుసార్లు పెవిలియన్‌కు పంపాడు. 

చదవండి: చరిత్ర సృష్టించిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. తొలి భారత క్రికెటర్‌గా 
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్‌! టాప్‌లో పాకిస్తాన్‌.. 

మరిన్ని వార్తలు