అతనితో చాట్‌ చేశా.. ఫామ్‌లోకి వచ్చా: కోహ్లి

15 Mar, 2021 11:02 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో డకౌటైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. రెండో మ్యాచ్‌లో మాత్రం అజేయంగా 73 పరుగులు సాధించి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి.. తర్వాతి మ్యాచ్‌లో మెరవడంతో విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పినట్లయ్యింది. అయితే తాను తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకోవడంలో స్నేహితుడు, ఆర్సీబీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ సహకారం ఉందన్నాడు. ‌ మ్యాచ్‌ తర్వాత అవార్డుల ప్రెజంటేషన్‌ కార్యక్రమంలో కోహ్లి మాట్లాడుతూ.. తన ఫామ్‌ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏబీ డివిలియర్స్‌ను పేరును ప్రస్తావించాడు. ‘నేను తొలి టీ20లో విఫలమైన తర్వాత ఏబీతో చాట్‌చేశా. నాకు ఏబీ డివిలియర్స్‌  కొన్ని సూచనలు చేశాడు. ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి డివిలియర్స్‌తో చేసిన చాట్‌ కూడా ఉపయోగపడింది. ఇక్కడ చదవండి: చాలా మంది చేయలేనిది పంత్‌ చేసి చూపించాడు.. 

ఇక టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సహకారం కూడా మరువలేనిది. నాకు వారు తగినంత స్పేస్‌ ఇవ్వడంతో మా ప్రణాళికలు కచ్చితంగా అమలు చేయగలిగాను. నా భార్య అనుష్క శర్మ సైతం నాకు అండగా నిలిచింది’ అని కోహ్లి తెలిపాడు.   ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్‌ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్‌ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీకి, అరంగేట్రం బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత అర్ధశతకం తోడవ్వడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.  

మరిన్ని వార్తలు