సన్‌రైజర్స్‌ ఖాతా తెరిచేనా?

26 Sep, 2020 19:08 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. ముందుగా బ్యాటింగ్‌ తీసుకోవడానికి మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. ఇరుజట్లు ఇప్పటివరకూ ఆడిన తొలి మ్యాచ్‌ల్లో ఓటమి చెందాయి. దాంతో పాయింట్ల ఖాతా తెరవడానికి ఇరుజట్లు పూర్తి స్థాయిలో సమయాత్తమవుతున్నాయి. సన్‌రైజర్స్‌ ఆడిన గత మ్యాచ్‌లో ఆర్సీబీపై ఓటమి చవిచూడగా, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ పరాజయం చెందింది. దాంతో గెలుపు కోసం తహతహలాడుతున్న ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఇరు జట్లు 17సార్లు తలపడగా కేకేఆర్‌ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఎస్‌ఆర్‌హెచ్‌ 7 మ్యాచ్‌ల్లో గెలుపును అందుకుంది. నేటి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. మిచెల్‌ మార్ష్‌ స్థానంలో మహ్మద్‌ నబీ రాగా, విజయ్‌ శంకర్‌ స్థానంలో సాహా జట్టులోకి వచ్చాడు.  ఇక సందీప్‌ శర్మను రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేయగా, ఖలీల్‌ అహ్మద్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. కేకేఆర్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. నాగర్‌కొటి కమ్లేష్‌, వరుణ్‌ చక్రవర్తిలు జట్టులోకి వచ్చారు.(చదవండి: ధోని క్రికెట్‌ చూడొద్దు: అజయ్‌ జడేజా)

వార్నర్‌ వర్సెస్‌ కమిన్స్‌
ఈ మ్యాచ్‌లో  వార్నర్‌-కమిన్స్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో వార్నర్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరితే,  కమిన్స్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది చివర్లో జరిగిన వేలంలో కమిన్స్‌ను రూ. 15.50 కోట్లను వెచ్చించి కేకేఆర్‌ కొనుగోలు చేసింది. అయితే ముంబైతో మ్యాచ్‌లో కమిన్స్‌ 16.33 ఎకానమీతో నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లోనైనా తన సత్తా చూపెట్టేందుకు కమిన్స్‌ సన్నద్ధమయ్యాడు. మరొకవైపు వార్నర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. 127 మ్యాచ్‌ల్లో 4, 712 పరుగులు సాధించాడు. దాదాపు 142.00 స్టైక్‌రేట్‌తో వార్నర్‌ ఈ పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 44 హాప్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక కమిన్స్‌ 17 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 17 వికెట్లు సాధించాడు. ఇందులో కమిన్స్‌ ఎకానమీ 8.67గా ఉంది.(చదవండి: రైనా వైపు చూసే ప్రసక్తే లేదు: సీఎస్‌కే)

ఎస్‌ఆర్‌హెచ్‌ 
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌ స్టో, మనీష్‌ పాండే, ప్రియాం గార్గ్‌, మహ్మద్‌ నబీ, వృద్ధిమాన్‌ సాహా, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, టి నటరాజన్‌

కేకేఆర్‌
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), సునీల్‌ నరైన్‌, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రీ రసెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, శివం మావి

Poll
Loading...
మరిన్ని వార్తలు