బెన్‌ స్టోక్స్‌ వచ్చేశాడు..

11 Oct, 2020 15:06 IST|Sakshi

దుబాయ్‌:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయడానికి మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరు మ్యాచ్‌లాడి మూడింట గెలవగా, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరు మ్యాచ్‌లకు గాను రెండింట మాత్రమే విజయం సాధించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన రాజస్తాన్‌.. ఆపై వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. దాంతో ఓటములకు బ్రేక్‌ వేయాలనే సంకల్పంతో రాజస్తాన్‌ బరిలోకి దిగుతుండగా,  మరొక విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికల్లో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఆరెంజ్‌ ఆర్మీ భావిస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులోకి ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు అవకాశం కల్పించగా, అబ్దుల్‌ సామద్‌ను తప్పించారు. ఇక రాజస్తాన్‌ జట్టులో రియాన్‌ పరాగ్‌, రాబిన్‌ ఊతప్పలకు మరొకసారి అవకాశం ఇచ్చారు. కాగా, ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను రాజస్తాన్‌ జట్టులోకి తీసుకోవడంతో ఆజట్టు బలం పెరిగింది. 

సన్‌రైజర్స్‌ ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌లు గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగినా వార్నర్‌ సేన ఉన్న వనరులతోనే ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతోంది.  మరొకవైపు రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా ఓటములను చవిచూస్తోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సన్‌రైజర్స్‌కు రాజస్తాన్‌ పోటీ ఇవ్వాలంటే పూర్తిస్థాయి ప్రదర్శన చేయక తప్పదు. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 11 మ్యాచ్‌లు జరగ్గా అందులో ఎస్‌ఆర్‌హెచ్‌ 6 విజయాలు సాధించగా,  రాజస్తాన్‌ రాయల్స్‌ 5 విజయాల్ని సొంతం చేసుకుంది. 

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ అదరగొడుతోంది. డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, విలియమ్సన్‌లు మంచి టచ్‌లో ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం.  మనీష్‌ పాండే మళ్లీ గాడిలో పడితే ఆ జట్టుకు తిరుగుండదు. యువ క్రికెటర్లు అభిషేక్‌ శర్మ, ప్రియాం గార్గ్‌లు సైతం ఆకట్టుకోవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ రెట్టించిన ఉత్సాహంతో ఉంది.  బౌలింగ్‌ విభాగంలో రషీద్‌ ఖాన్‌, టి నటరాజన్‌లు ఎస్‌ఆర్‌హెచ్‌కు కీలకంగా మారారు.  మరొక పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ కూడా ఆకట్టుకోవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కూడా తీరింది. 

రాజస్తాన్‌ రాయల్స్‌ను మాత్రం వరుస వైఫల్యాలు వేధిస్తున్నాయి. ఆ జట్టు యశస్వి జైస్వాల్‌, స్టీవ్‌ స్మిత్‌, సంజూ శాంసన్‌, జోస్‌ బట్లర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు రాణిస్తేనే భారీ స్కోర‍్లను సాధిస్తోంది. వీరు విఫలమైతే మాత్రం రాజస్తాన్‌ మరొక ఓటమిని చవిచూడాల్సి ఉంటుంది. ఓటములకు చెక్‌ పెట్టాలనే లక్క్ష్యంతో రాజస్తాన్‌ ఒకవైపు.. మరొక గెలుపే లక్ష్యంగా సన్‌రైజర్స్‌ మరొకవైపు పోరుకు సన్నద్ధం కావడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు