-

SLC: నడిరోడ్డు మీద నన్ను హత్య చేసే అవకాశం.. కారణం ఇదే: లంక మాజీ మంత్రి

27 Nov, 2023 19:20 IST|Sakshi

శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రక్షాళన కోసం తపించి తాను ప్రాణం మీదకు తెచ్చుకున్నానంటూ ఆ దేశ ‘క్రీడా మంత్రి’ రోషన్‌ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి నిర్మూలిద్దామని భావిస్తే తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేపై సంచలన ఆరోపణలు చేశారు.

కాగా భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంక జట్టు దారుణ వైఫల్యం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది.

వరల్డ్‌కప్‌లో పరాభవం
ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ జట్టు ఎంపిక, అనుసరించిన వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా మంత్రి రోషన్‌ రణసింఘే బోర్డు సభ్యులందరినీ సస్పెండ్‌ చేశారు. మాజీ కెప్టెన్‌ అర్జున్‌ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో బోర్డు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు లంక క్రికెట్‌ బోర్డును పునురద్ధరించింది. అయితే, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి కఠిన నిర్ణయం తీసుకుంది.

లంక బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ
క్రికెట్‌ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా రోషన్‌ రణసింఘే సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. క్రికెట్‌ బోర్డులో జోక్యం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారంటూ ఆయన ఆరోపించారు.

నడిరోడ్డు మీద హత్య చేసే అవకాశం!
ఈ మేరకు.. ‘‘క్రికెట్‌ బోర్డులో అవినీతిని నిర్మూలించాలనుకున్నందుకు నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదే నన్ను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు అధ్యక్షుడు, అతడి చీఫ్‌ స్టాఫ్‌ మాత్రమే బాధ్యులు’’ అని రోషన్‌ రణసింఘే వ్యాఖ్యానించారు. 

భారీ ఆదాయానికి గండి!
కాగా మంత్రి వర్గం నుంచి రోషన్‌ సస్పెన్షన్‌పై అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆయన ఆరోపణలపై మాత్రం ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా ద్వీపదేశంలో ధనిక క్రీడా సంస్థగా లంక క్రికెట్‌ బోర్డు కొనసాగుతోంది. క్రికెట్‌ ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది.

గతంలో వరల్డ్‌కప్‌ గెలిచిన ఘనతతో పాటు పటిష్ట జట్టుగానూ ఆ టీమ్‌కు పేరుంది. అయితే, గత కొంతకాలంగా ఘోర పరాభవాలతో ప్రతిష్టను మసకబార్చుకుంటోంది శ్రీలంక జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ సస్పెన్షన్‌ మరింత దెబ్బ కొట్టగా.. అధ్యక్షుడు విక్రమసింఘే నిషేధానికి గల కారణాల అన్వేషణకై విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది.

చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా?

మరిన్ని వార్తలు