CWC 2023: రాహుల్‌ ద్రవిడ్‌ మా అంకుల్‌.. ఆయనను చూస్తే బాధేసింది.. ఇదే చివరిది: ప్రముఖ నటి

24 Nov, 2023 19:47 IST|Sakshi
రాహుల్‌ ద్రవిడ్‌తో అదితి ద్రవిడ్‌ (PC: Aditi instagram)

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో భారత్‌ ఓటమి తననెంతో బాధించిందని టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బంధువు, మరాఠా నటి అదితి ద్రవిడ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా తన అంకుల్‌ అత్యుత్తమ కోచ్‌గా చరిత్రలో నిలిచిపోతారంటూ ఉద్వేగానికి లోనైంది.

కాగా సొంతగడ్డపై టీమిండియా వన్డే ప్రపంచకప్‌ గెలుస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా రోహిత్‌ సేనను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా ఉన్న భారత జట్టుకు షాకిస్తూ.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా అవతరించింది. దీంతో టీమిండియా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. స్టార్‌ బ్యాటర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సహా కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ సిరాజ్‌ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.   

ఈ దృశ్యాలు చూసి టీమిండియా ఫ్యాన్స్‌ హృదయాలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో అదితి ద్రవిడ్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకుంది. రాహుల్‌ ద్రవిడ్‌ను చూసి తమ కుటుంబమంతా గర్విస్తోందని పేర్కొంది.

ద్రవిడ్‌ మా అంకుల్‌
ఈ మేరకు.. ‘‘రాహుల్‌ ద్రవిడ్‌ మా అంకుల్‌. గత 30- 35 ఏళ్లుగా ఆయన క్రికెట్‌ మైదానంలో కఠిన శ్రమకోరుస్తున్నారు. మా నాన్న వినాయక్‌ ద్రవిడ్‌ కూడా రంజీ ప్లేయర్‌. అందుకే నాకు క్రికెట్‌తో అనుబంధం ఏర్పడింది. టీమిండియా ఓడిపోయిన దృశ్యాలు చూసి నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలో మా అంకుల్‌ను చూస్తే చాలా బాధేసింది. 

హెడ్‌కోచ్‌గా ఆయన ప్రస్థానం కూడా ముగింపునకు వస్తోంది. ఆయనకు బహుశా ఇదే ఆఖరి వరల్డ్‌కప్‌. ఎంతో హార్డ్‌వర్క్‌ చేసి జట్టును ఇక్కడిదాకా తీసుకువచ్చారు. కానీ ఆఖర్లో ఇలా జరిగిపోయింది. ఏదేమైనా ఆయన బెస్ట్‌ కోచ్‌’’ అని అదితి ద్రవిడ్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది.

ది వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. హెడ్‌కోచ్‌గానూ
కాగా మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాహుల్‌ ద్రవిడ్‌కు అదితి కూతురు వరుస అవుతుంది. ఆమె ప్రస్తుతం బుల్లితెరపై నటిగా రాణిస్తోంది. ఇటీవల సుందర మన మధ్యే భార్లీ సీరియల్‌లో కనిపించింది. అంతేకాదు రెండు మరాఠా సినిమాల్లోనూ అదితి మెరిసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ రాణిస్తోంది.

ఇక మరాఠా మూలాలున్న రాహుల్‌ ద్రవిడ్‌ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన విషయం తెలిసిందే. తండ్రి ఉద్యోగరిత్యా కర్ణాటకకు షిఫ్ట్‌ కావడంతో అక్కడే పెరిగి పెద్దైన ద్రవిడ్‌.. దేశవాళీ క్రికెట్లో కన్నడ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున ది వాల్‌గా.. దిగ్గజ క్రికెటర్‌గా పేరొందిన రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. త్వరలోనే అతడి కాంట్రాక్ట్‌ ముగియనుంది.

మరిన్ని వార్తలు