-

గ్రేటర్‌ హైదరాబాద్‌పై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌

27 Nov, 2023 19:19 IST|Sakshi

గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీ పార్టీకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయా? సిటీలో నివసిస్తున్న తెలంగాణేతర ప్రాంతాల ప్రజల ఓట్ల కోసం బీఆర్ఎస్ శ్రమిస్తోందా? హోరా హోరీగా జరిగే ఈ ఎన్నికల్లో బయటి ప్రాంతాలవారి ఓట్లే కీలకంగా మారనున్నాయా? సామాజిక వర్గాల వారీగా ఓట్లు కూడగట్టేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? బయటి ప్రాంతాల ప్రజల ఓట్లు సాధించడంలో గులాబీ పార్టీ సక్సెస్ అవుతుందా? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అన్ని పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా ఓటర్లకు చేరుయ్యేందుకు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ...అమలు చేస్తున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు.. ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో వారి ఓట్లపై బీఆర్‌ఎస్‌ ఫోకస్ పెట్టింది. గ్రేటర్‌లో మెజార్టీ సీట్లు గెలవాలంటే వారి ఓట్లు కీలకం కాబట్టి...ఇతర ప్రాంతాల ప్రజల విశ్వాసం పొందేందుకు గులాబీ పార్టీ అభ్యర్థులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణేతర ప్రజల ఓట్లను అన్ని పార్టీలు కీలకంగా భావించాయి.

ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లతో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న బీఆర్‌ఎస్‌  పార్టీ అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ అభ్యర్థులు ఆయా సామాజికవర్గ నేతల భేటీలు పూర్తి చేసే పనిలో ఉన్నారట. చివరి దశలో ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆయా సామాజికవర్గాలతో భేటీలు నిర్వహించి మద్దతు కోరతారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గ్రేటర్ లో ఎక్కువ సీట్లు గెలవకపోయినా...2018 వచ్చే సరికి పూర్తి స్థాయిలో విపక్ష పార్టీలపై ఆధిక్యం సాధించింది బీఆర్‌ఎస్‌. ఇప్పుడు కూడా గ్రేటర్ లో అదే స్థాయిలో సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలలో మునిగి తేలుతున్నది గులాబీ పార్టీ.

గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి ఓటర్లు ఎటువైపు ఉంటారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఎంఐఎం ప్రాతినిత్యం వహిస్తున్న స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో గులాబీ పార్టీ పాగా వేస్తుందా లేదా అనే చర్చ మాత్రం జరుగుతోంది. గ్రేటర్ ప్రజలు ఎవరిని కరుణిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు