T20 WC 2021 Ind Vs Afg: అప్పుడైతే ఏకంగా 218.. ఆ మ్యాచ్‌లో 186.. రైనా ఒక్కడే సెంచరీతో..

4 Nov, 2021 14:06 IST|Sakshi

Highest totals for India in T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా మొదటి విజయాన్ని నమోదు చేసిన విషయం విదితమే. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్‌... 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసి 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఇది ఇలా ఉంటే... వరుస పరాజయాల తర్వాత టీమిండియాకు భారీ విజయం దక్కడంతో పాటు.. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ అత్యధిక స్కోర్లు నమోదు చేసిన సందర్భాలను పరిశీలిద్దాం.

అప్పుడు ఏకంగా 218..
మొట్టమొదటి పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ 2007లో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌తో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోని సేన 18 పరుగులతో విజయం సాధించింది. ఇక 2007 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అఫ్గనిస్తాన్‌తో ఇప్పుడు
నవంబరు 3, 2021లో అబుదాబిలో జరిగిన అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి సేన 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో గెలుపొందింది.

వెస్టిండీస్‌పై...
టీ20 ప్రపంచకప్‌-2016 సెమీ ఫైనల్‌లో టీమిండియా వెస్టిండీస్‌తో తలపడింది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అయితే, పొలార్డ్‌ బృందం చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో భారత్‌కు ఓటమి తప్పలేదు. లెండిల్‌ సిమన్స్‌ 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్‌ను గెలుపు బాట పట్టించాడు. 

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో
టీ20 వరల్డ్‌కప్‌-2007లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ధోని సేన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సెమీ ఫైనల్‌లో ఆసీస్‌తో తలపడిన టీమిండియా... యువరాజ్‌ సింగ్‌ చెలరేగడంతో 15 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 30 బంతుల్లో 70 పరుగులు చేసిన యువీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంతో ఫైనల్‌ చేరిన ధోని బృందం...పాకిస్తాన్‌ను మట్టి కరిపించి మొదటి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది.

2010లో దక్షిణాఫ్రికాపై
ప్రపంచకప్‌ టోర్నీ-2010లో భాగంగా సెయింట్‌ లూసియానాలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో టీమిండియా 180 పరుగుల పైచిలుకు స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి... 186 పరుగులు చేసింది. బౌలర్లు రాణించడంతో 172 పరుగులకే ప్రొటిస్‌ను కట్టడి చేసి.. 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో వంద పరుగులు సురేశ్‌ రైనానే సాధించడం విశేషం. 60 బంతుల్లో 101 పరుగులు చేసి అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న రైనాను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

ఇక టీ20 వరల్డ్‌కప్‌-2021లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోర్లను పరిశీలిస్తే..
ఇండియా వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌...అబుదాబి- టీమిండియా- 210/2.
అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌... షార్జా- అఫ్గనిస్తాన్‌-190/4.
పాకిస్తాన్‌ వర్సెస్‌ నమీబియా.. అబుదాబి... పాకిస్తాన్‌- 189/2.
బంగ్లాదేశ్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా... ఏఐ అమెరట్‌- బంగ్లాదేశ్‌- 181/7.

-సాక్షి, వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం.

చదవండి: IND Vs AFG: టీమిండియా విజయం.. ఐదు ఆసక్తికర విషయాలు

మరిన్ని వార్తలు