Shoaib Akhtar: ఏంటది అసహ్యంగా.. అసలు విషయం తెలీదా.. లేదంటే సెమీస్‌లో పాక్‌ను ఓడించినందుకేనా అక్కసు!

16 Nov, 2021 10:14 IST|Sakshi

Shoaib Akhtar On Australia Way of Celebration Little Disgusting Netizens Troll Him: టి20 ప్రపంచకప్‌-2021 విజేతగా నిలిచిన ఆరోన్‌ ఫించ్‌ బృందం సంబరాలు చేసుకున్న తీరుపై పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అసహ్యకరంగా సెలబ్రేషన్స్‌ చేసుకోవడం అవసరమా అంటూ సెటైర్లు వేశాడు. కాగా పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో ఆరుసార్లు నిరాశకు గురైన ఆస్ట్రేలియా ఎట్టకేలకు ఈ ఏడాది చాంపియన్‌గా నిలిచి తమ కలను నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే.

దీంతో కంగారూ జట్టు పట్టపగ్గాల్లేని ఆనందడోలికల్లో మునిగితేలింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న పొట్టి కప్‌ చేతులకందడంతో ఆటగాళ్లు తెగ సంబరాలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి స్టేడియంలోని డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరగానే క్రికెటర్లు టిన్‌లలోని బీరును కాలి బూట్లలో పోసుకొని గుటకేశారు. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ కాలికి ఉన్న బూట్‌ విడిచి దాన్ని కడిగాకా బీరు పోసుకొని తాగాడు. కెప్టెన్‌ ఫించ్‌ అదేపని చేశాడు. తర్వాత వేడ్‌ సహా కొందరు సహచరులు ఇలా బూట్లలో బీరు తాగారు. 

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా.. తన ట్విటర్‌ అ‍కౌంట్‌లో షేర్‌ చేసిన షోయబ్‌ అక్తర్‌.. ‘‘అసలు మీరేం చేశారు? వీళ్లు సెలబ్రేషన్స్‌ చేసుకున్న తీరు కాస్త అసహ్యంగా ఉంది కదా’’ అని కామెంట్‌ చేశాడు. ఈ క్రమంలో పాక్‌ ఫ్యాన్స్‌.. ‘‘కొంచెం కాదు.. చాలా జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ అక్తర్‌కు మద్దతు పలుకుతున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘ఇది వారి సంప్రదాయంలో భాగం. ముందు ఆ విషయం తెలుసుకోండి. తెలియకపోతే ఊరుకోండి.

అయినా, సెమీస్‌లో మిమ్మల్ని ఓడించినందుకేనా ఈ అక్కసు’’ అని అక్తర్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా రెండో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సూపర్‌ 12 రౌండ్‌లో ఐదింటికి ఐదు గెలిచి కప్‌ కొట్టాలన్న ఆశతో ఉన్న బాబర్‌ ఆజమ్‌ బృందానికి షాక్‌ తగిలింది. తుది పోరుకు అర్హత సాధించిన ఆసీస్‌.. న్యూజిలాండ్‌ను ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించింది.

షూయీ సంప్రదాయం
ఇలా బూట్లలో డ్రింక్స్‌ పోసుకుని తాగటం మనకు జుగుప్సాకరంగా ఉన్నా ఆస్ట్రేలియాలో ఇలాంటి సంబరాలు సాధారణమే! అన్నట్లు దీనికో పేరు కూడా ఉంది.  షూలో పోసుకు తాగడాన్ని ‘షూయి’ అంటారు. విశ్వవిజేతగా నిలవడంతో కంగారూ క్రికెటర్లు అలా షూయి వేడుక చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫార్ములావన్‌ డ్రైవర్‌ రికియార్డో 2016లో జర్మన్‌ గ్రాండ్‌ప్రిలో పోడియం ఫినిష్‌ చేయగానే తొలిసారి షాంపేన్‌ బూట్లో పోసుకొని తాగాడు. 

చదవండి: Hardik Pandya: హార్దిక్‌ పాండ్యాకు భారీ షాక్‌.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్‌!

మరిన్ని వార్తలు