T20 WC 2022 NZ VS SL: శతక్కొట్టిన ఫిలిప్స్‌.. శ్రీలంకను చిత్తు చేసిన కివీస్‌

29 Oct, 2022 17:12 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 -New Zealand vs Sri Lanka Updates:

65 పరుగుల తేడాతో కివీస్‌ ఘన విజయం
టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 102 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో కివీస్‌ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రజిత 2 వికెట్ల పడగొట్టగా.. తీక్షణ, ధనంజయ, హసరంగ, లహిరు కుమార తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసింది. భానుక రాజపక్ష (34), దసున్‌ శనక (35) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 4 వికెట్లు పడగొట్టగా.. సాంట్నర్‌, సోధి తలో 2 వికెట్లు.. సౌథీ, ఫెర్గూసన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
బౌల్ట్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి డసున్‌ షనక (35) ఔటయ్యాడు. ఫలితంగా శ్రీలంక 93 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 

వరుస ఓవర్లలో వికెట్లు.. 65 పరుగులకే 8 వికెట్లు డౌన్‌
శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. 12, 13 ఓవర్లలో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. సోధి బౌలింగ్‌లో హసరంగ (4), సా​ంట్నర్‌ బౌలింగ్‌లో తీక్షణ (0) పెవిలియన్‌కు చేరారు. దీంతో శ్రీలంక 65 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. 

ఆరో వికెట్‌ డౌన్‌
10వ ఓవర్‌ ఆఖరి బంతికి శ్రీలంక ఆరో వికెట్‌ కోల్పోయింది. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి రాజపక్ష (34) పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 58/6. 

24 పరుగులకే ఐదు వికెట్లు డౌన్‌
న్యూజిలాండ్‌తో పోరులో శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. తాజాగా మూడు పరుగులు చేసిన చమిక కరుణరత్నే మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు చరిత్‌ అసలంక(4) రూపంలో లంక నాలుగో వికెట్‌ కోల్పోయింది.

5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక
ట్రెంట్‌ బౌల్ట్‌ చెలరేగడంతో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో బౌల్ట్‌.. కుశాల్‌ మెండిస్‌ (4), ధనంజయ డిసిల్వా (0) పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా శ్రీలంక 2 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో నిస్సంక (0) ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. ఫలితంగా శ్రీలంక పరుగులేమీ చేయకుండానే వికెట్‌ కోల్పోయింది. 

శతక్కొట్టిన ఫిలిప్స్‌.. శ్రీలంక టార్గెట్‌ 168
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో కివీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 

శతక్కొట్టిన గ్లెన్‌ ఫిలిప్స్‌
న్యూజిలాండ్‌ ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ సెంచరీ కొట్టాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 19 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 153/5. గ్లెన్‌ ఫిలిప్స్‌ (103), సాంట్నర్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
18వ ఓవర్‌లో న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. రజిత బౌలింగ్‌లో షకనకు క్యాచ్‌ ఇచ్చి నీషమ్‌ (5) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 140/5. గ్లెన్‌ ఫిలిప్స్‌ (93), సాంట్నర్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

నాలుగో వికెట్‌ డౌన్‌
15వ ఓవర్‌లో న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌ (22) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 14.3 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 99/4. 

గ్లెన్‌ ఫిలిప్స్‌ ఫిఫ్టి
వరుసగా 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్‌ ఫిలిప్స్‌ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఫిలిప్స్‌ 39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌ సాయంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. మరో ఎండ్‌లో డారిల్‌ మిచెల్‌ (22) నిదానంగా ఆడుతున్నాడు. 

11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 63/3
వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌, ఆతర్వాత మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడింది. గ్లెన్‌ ఫిలిప్‌ (37), డారిల్‌ మిచెల్‌ (13) ఆచితూచి ఆడుతూ స్కోర్‌ బోర్డును నెమ్మదిగా పరుగులు పెటిస్తున్నారు. 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 63/3. 

కట్టుదిట్టంగా శ్రీలంక బౌలింగ్‌
9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసిన న్యూజిలాండ్‌. మిచెల్‌, ఫిలిప్స్‌ క్రీజులో ఉన్నారు.

పవర్‌ప్లేలో న్యూజిలాండ్‌ స్కోరు- 25/3

పెవిలియన్‌కు క్యూ కడుతున్న కివీస్‌ బ్యాటర్లు
లంక బౌలర్లు కివీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వరుస ఓవర్లలో వికెట్లు పడగొడుతూ కివీస్‌ను కష్టాల ఊబిలోకి నెడుతున్నారు. కసున్‌ రజిత వేసిన నాలుగో ఓవర్‌లో కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (8).. కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా ఆ జట్టు 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 

రెచ్చిపోతున్న స్పిన్నర్లు.. న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ డౌన్‌
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్లు రెచ్చిపోతున్నారు. తొలి ఓవర్‌లోనే తీక్షణ.. ఫిన్‌ అలెన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేయగా, మూడో ఓవర్‌లో ధనంజయ డిసిల్వా.. డెవాన్‌ కాన్వేను (1) అదే తరహాలో ఔట్‌ చేశాడు. ఫలితంగా న్యూజిలాండ్‌ 7 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. మహీశ్‌ తీక్షణ​ బౌలింగ్‌లో ఫిన్‌ అలెన్‌ (1) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-1లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 29) న్యూజిలాండ్‌-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు..
న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌, గ్లెన్‌ ఫిలిప్‌, డారిల్‌ మిచెల్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌, టిమ్‌ సౌథీ, ఐష్‌ సోధీ, లోకీ ఫెర్గూసన్‌. ట్రెంట్‌ బౌల్ట్‌

శ్రీలంక: పథుమ్‌ నిస్సంక, కుశాల్‌ మెండిస్‌, ధనంజయ డిసిల్వా, చరిత్‌ అసలంక, భానుక రాజపక్ష, దసున్‌ శకన, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్‌ తీక్షణ, లహిరు కుమార, కసున్‌ రజిత

Poll
Loading...
మరిన్ని వార్తలు