పంజాబ్ ఫార్ములాను ఫాలో అవుతున్న కేజ్రీవాల్.. గుజరాత్‌ సీఎం అభ్యర్థిపై కీలక ప్రకటన..

29 Oct, 2022 13:09 IST|Sakshi

గాంధీనగర్‌: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా ఎవరుండాలని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్. ఈ సర్వేలో భగవంత్ మాన్‌కే అందరూ పట్టంగట్టారు. దీంతో ఆయన్నే తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు కేజ్రీవాల్‌. అనంతరం ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించింది. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో జెండా ఎగురవేసింది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోనూ పంజాబ్‌ ఫార్ములానే రిపీట్ చేస్తున్నారు కేజ్రీవాల్. సీఎం అభ్యర్థిని ఎన్నుకునే ఛాయిస్‌ను అక్కడి ప్రజలకే ఇచ్చారు. శనివారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుజరాత్‌లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందో నవంబర్ 3లోగా చెప్పాలని ఓ ఫోన్ నంబర్, ఈమెయిల్‌ ఇచ్చారు.

అలాగే గుజరాత్‌లో అధికార బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఐదేళ్లకు ఆ పార్టీ వద్ద ఎలాంటి ప్రాణాళిక లేదన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో ధరల పెరుగుదల సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఏడాది క్రితం సీఎం విజయ్ రూపానిని తప్పించి భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా బిజేపీ నియమించిందని గుర్తు చేశారు. కానీ ఒక్కరి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సీఎంను మార్చారని చెప్పారు. తాము బీజేపీలా కాదని, సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయం పూర్తిగా ప్రజలకే వదిలేస్తామని వివరించారు.

గుజరాత్‌లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని ఆప్ పట్టుదలతో ఉంది. అందుకే అరవింద్ కేజ్రీవాల్ తరచూ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. బీజేపీకి బలంగా ఉన్న హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరెన్సీ నోట్లపై గాంధీతో పాటు లక్షీదేవి, వినాయకుడి ఫోటోలను కూడా ముద్రించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు.
చదవండి: కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్‌..

>
మరిన్ని వార్తలు