T20 WC: బీసీసీఐ మంచి నిర్ణ‌యం తీసుకుంది.. నిజానికి రాహుల్‌..: గంభీర్‌

29 Nov, 2023 18:28 IST|Sakshi
గంభీర్‌- ద్ర‌విడ్‌(PC: ACC/BCCI)

టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్‌ను కొన‌సాగించాల‌న్న భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి నిర్ణ‌యాన్ని మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్ స‌మ‌ర్థించాడు. వ‌చ్చే ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో బీసీసీఐ స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. 

ర‌విశాస్త్రి త‌ర్వాత‌...
కాగా 2021లో  ర‌విశాస్త్రి కాంట్రాక్ట్ ముగిసిన త‌ర్వాత అత‌డి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్ర‌విడ్ భార‌త జ‌ట్టు హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. జాతీయ క్రికెట్ అకాడ‌మీ పెద్ద‌గా.. అండ‌ర్‌-19 జ‌ట్టుకు మార్గ‌ద‌ర్శ‌నం చేసిన మిస్ట‌ర్ డిఫెండ‌బుల్‌ను ఒప్పించి మ‌రీ నాటి బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ప‌గ్గాలు అప్ప‌జెప్పాడు.

ఈ క్ర‌మంలో ద్ర‌విడ్ శిక్ష‌ణ‌లో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌ల‌లో అద‌ర‌గొట్టింది. వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ చేరింది. కానీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2022లో సెమీస్‌లోనే నిష్క్ర‌మించిన రోహిత్ సేన‌.. సొంత‌గ‌డ్డ‌పై వ‌ర‌ల్డ్ క‌ప్‌-2023లో ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయింది.

ఇక టోర్నీతోనే త‌న ప‌ద‌వీకాలం కూడా ముగిసిపోవ‌డంతో ద్ర‌విడ్ కోచ్‌గా వైదొల‌గాల‌ని భావించినట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం రాహుల్ ద్ర‌విడ్‌ను ఒప్పించి హెడ్‌కోచ్‌గా కొన‌సాగేలా చేసింది. ఇందుకు సంబంధించి బుధ‌వారం అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది.

బీసీసీఐ నిర్ణయం స‌రైంది 
ఈ నేప‌థ్యంలో మాజీ ఓపెన‌ర్ గౌతం గంభీర్ స్పందించాడు. “బీసీసీఐ మంచి నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చే ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుంది. ఇలాంటి స‌మ‌యంలో కోచింగ్‌, స‌హాయ‌క సిబ్బందిని మార్చ‌డం స‌రికాదు. 

నిజానికి రాహుల్ బీసీసీఐ ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రించ‌డం శుభ‌ప‌రిణామం. టీమిండియా ఇలాగే త‌మ ఆధిప‌త్యం కొన‌సాగిస్తూ మున్ముందు మ‌రింత గొప్ప‌గా ఆడాల‌ని కోరుకుంటున్నా” అని గౌతీ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.

చ‌దవండి: కేన్‌ విలియమ్సన్‌ అద్భుత సెంచరీ.. విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు సమం

మరిన్ని వార్తలు