టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే.. బీసీసీఐ అధి​కారిక ప్రకటన

29 Nov, 2023 14:13 IST|Sakshi

భారత పురుషల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగనున్నాడు. ద్రవిడ్‌ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. ద్రవిడ్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఇతర సహాయ సిబ్బంది కాంట్రాక్ట్‌లను బీసీసీఐ పొడిగించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తమ పదవిల్లో కొనసాగనున్నారు. ఈ మెరకు బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంతకాలం పాటు వారి పదవికాలాన్ని పెంచారన్నది బీసీసీఐ వెల్లడించలేదు.

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌-2024 వరకు కొనసాగే ఛాన్స్‌ ఉంది. "వన్డే ప్రపంచకప్‌-2023తో రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా పదవీ కాలం ముగిసిన తర్వాత బీసీసీఐ అతడితో సంప్రదింపులు జరిపింది. అతడితో పాటు సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్టుల పొడిగింపును బీసీసీఐ ఏకగ్రీవంగా అంగీకరించింది. టీమిండియాను  తీర్చిదిద్దడంలో రాహుల్ ద్రవిడ్ పాత్రను బోర్డు గుర్తించింది.  అతడి నేతృత్వంలో భారత జట్టు ఎన్నో అద్బుతవిజయాలను అందుకుంది. అదే విధంగా నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ హెడ్‌, స్టాండ్‌ ఇన్‌ హెచ్‌ వీవీయస్‌ లక్ష్మణ్‌ను కూడా బోర్డు అభినందిస్తుంని" బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ కాంట్రాక్ట్ వన్డే ప్రపంచకప్‌-2023తో ముగిసింది. 2021లో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాడు. అయితే తర్వాత కూడా అతడినే కొనసాగించాలని బీసీసీఐతో పాటు ఛీప్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ భావించినప్పటికీ.. అందుకు ద్రవిడ్‌ మాత్రం మొదట్లో ఒప్పుకోలేదు. కానీ బీసీసీఐ పెద్దలు జోక్యం చేసుకుని ద్రవిడ్‌ను ఒప్పించారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో జట్టుతో పాటు ద్రవిడ్‌ కూడా సౌతాఫ్రికాకు వెళ్లనున్నాడు.

మరిన్ని వార్తలు