Aus Vs Pak Semi Final 2021 Highlights: వరుసగా 6, 6, 6. అంతే!! ఇంకో ఓవర్‌ ఉన్నా... పాక్‌ పనైపోయింది! ఫైనల్‌కు ఆస్ట్రేలియా

12 Nov, 2021 07:41 IST|Sakshi

ఆస్ట్రేలియా అదరహో

అజేయ పాకిస్తాన్‌కు సెమీస్‌లో ఓటమి

T20 World Cup 2021: Australia Beat Pakistan By 5 Wickets Enters Final: ఆస్ట్రేలియా లక్ష్యం 177. దూకుడుగా ఆడుతున్న వార్నర్‌ జట్టు స్కోరు 89 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఇంకో 7 పరుగులకే హార్డ్‌ హిట్టర్‌ మ్యాక్స్‌వెల్‌ చేతులెత్తేశాడు. వందలోపే ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అందరూ పెవిలియన్‌లో ప్రేక్షకులయ్యారు. స్టొయినిస్, మ్యాథ్యూ వేడ్‌ తర్వాత బ్యాట్స్‌మెనే లేడు. ఆసీస్‌ గెలుస్తుందన్న ఆశ కూడా లేదు.  

పాకిస్తాన్‌ బౌలింగ్‌ పట్టు బిగించిన వేళ... అంతో ఇంతో స్టొయినిస్‌ పోరాడుతున్నాడు... కానీ వేడ్‌ 13 ఓవర్లో క్రీజులోకి వచచ్చినా... 17 ఓవర్లు ముగిసినా పది పరుగులైనా చేయలేదు. అప్పటికి అతని స్కోరు 8! ఆసీస్‌ గెలవాలంటే 18 బంతుల్లో 37 పరుగులు చేయాలి. 18వ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టాడు. ఆఖరి 12 బంతుల్లో 22 పరుగుల సమీకరణం. షాహిన్‌ అఫ్రిది 19వ ఓవర్‌ వేశాడు. మూడో బంతికి క్యాచ్‌ మిస్‌ కావడంతో వేడ్‌ బతికిపోయాడు. 2 పరుగులు తీసి తనే స్ట్రయిక్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత చూస్తే చుక్కలే!! వరుసగా 6, 6, 6. అంతే!! ఇంకో ఓవర్‌ ఉన్నా... పాక్‌ పనైపోయింది. 

Australia Beat Pakistan By 5 Wickets In Semis: తొలి సెమీస్‌కు రిపీట్‌గా రెండో సెమీస్‌ జరిగినట్లుగా కనిపించింది. కివీస్‌ను నీషమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ పట్టాలెక్కిస్తే... వేడ్‌ (17 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆస్ట్రేలియాను  ఫైనల్‌కు చేర్చింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫఖర్‌ జమాన్‌ (32 బంతుల్లో 55 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. తర్వాత ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. వార్నర్‌ (30 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. స్టొయినిస్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.  

రాణించిన రిజ్వాన్‌ 
పాకిస్తాన్‌కు ఓపెనర్లు చక్కని ఆరంభమిచ్చారు. రిజ్వాన్, కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (34 బంతుల్లో 39; 5 ఫోర్లు) కలిసి అర్ధ సెంరీ భాగస్వామ్యం నమోదు చేశారు. పదో ఓవర్‌ వేసిన జంపా ఆఖరి బంతికి బాబర్‌ను అవుట్‌ చేశాడు. జంపా 12వ ఓవర్లో  స్లాగ్‌స్వీప్‌ షాట్‌తో స్కేర్‌ లెగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. మరుసటి బంతికి బైస్‌ రూపంలో 4 పరుగులతో మొత్తం 14 పరుగులొచ్చాయి. అనంతరం హాజల్‌వుడ్‌ వేసిన 14వ ఓవర్లో ఐదో బంతిని రిజ్వాన్‌ సిక్సర్‌గా తరలించడంతో పాక్‌ స్కోరు వందకు చేరింది. ఆ తర్వాతి బంతికే అతని అర్ధసెంచరీ (41 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా పూర్తయ్యింది. స్టార్క్‌ వేసిన 20వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో అతను 31 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకం  సాధించాడు. తొలి 10 ఓవర్లలో 71/1 స్కోరు చేసిన పాకిస్తాన్‌ మరో 10 ఓవర్లలో 106 పరుగులు చేసింది.  

ఆదిలోనే ఎదురుదెబ్బ 
ఇన్నింగ్స్‌ ఆరంభమైన ఓవర్లోనే కెప్టెన్‌ ఫించ్‌ (0) డకౌటయ్యాడు. పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహిన్‌ అఫ్రిది తన మూడో బంతికే అతన్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో ఓపెనర్‌ వార్నర్‌కు జతయిన మిచెల్‌ మార్ష్‌ చకచకా పరుగులు చేశాడు. ఇమాద్‌ నాలుగో ఓవర్లో వార్నర్‌ వరుసగా 6, 4, 4తో 17 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 30 బంతుల్లో 50 పరుగులు చేసింది. పవర్‌ ప్లేలో అంతా బాగానే ఉంది. లెగ్‌స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ మాయ మొదలయ్యాక ఆసీస్‌ ఆట తలకిందులైంది. ఏడో ఓవర్లో జోరు మీదున్న మార్ష్‌  (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ను అవుట్‌ చేశాడు.

హఫీజ్‌ వేసిన 8వ ఓవర్లో, షాదాబ్‌ వేసిన మరుసటి ఓవర్లో వార్నర్‌ కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించగా, రెండు బంతుల తర్వాత స్మిత్‌ (5)ను షాదాబ్‌ బోల్తా కొట్టించాడు. అయినప్పటికీ 10 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు 89/3తో మెరుగ్గానే ఉంది. ఈ దశలో వార్నర్‌  పెవిలియన్‌ చేరాడు. బంతి బ్యాట్‌కు తగలకున్నా కీపర్‌ రిజ్వాన్‌ చేతుల్లో పడింది. అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ అవుటిచ్చాడు. ఆశ్చర్యంగా వార్నర్‌ రివ్యూకు వెళ్లకుండా పెవిలియన్‌కు వెళ్లాడు. మ్యాక్స్‌వెల్‌ (7) వికెట్‌ అతని ఖాతాలోనే పడింది. ఆశల్లేని కంగారూ జట్టు శిబిరంలో అంతా కంగారే! అయితే వేడ్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆసీస్‌ను గెలిపించింది.  

స్కోరు వివరాలు 
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (సి) స్మిత్‌ (బి) స్టార్క్‌ 67; బాబర్‌ (సి) వార్నర్‌ (బి) జంపా 39; ఫకర్‌ జమన్‌ నాటౌట్‌ 55; ఆసిఫ్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 0; షోయబ్‌ మాలిక్‌ (బి) స్టార్క్‌ 1; హఫీజ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–71, 2–143, 3–158, 4–162. బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–38–2, హాజల్‌వుడ్‌ 4–0–49–0, మ్యాక్స్‌వెల్‌ 3–0–20–0, కమిన్స్‌ 4–0–30–1, జంపా 4–0–22–1, మిచెల్‌ మార్ష్‌ 1–0–11–0. 

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రిజ్వాన్‌ (బి) షాదాబ్‌ 49; ఫించ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షాహిన్‌ అఫ్రిది 0; మార్ష్‌ (సి) ఆసిఫ్‌ (బి) షాదాబ్‌ 28; స్మిత్‌ (సి) ఫఖర్‌ (బి) షాదాబ్‌ 5; మ్యాక్స్‌వెల్‌ (సి) రవూఫ్‌ (బి) షాదాబ్‌ 7; స్టొయినిస్‌ నాటౌట్‌ 40; వేడ్‌ నాటౌట్‌ 41; ఎక్స్‌ట్రాలు 7;  మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 177. 
వికెట్ల పతనం: 1–1, 2–52, 3–77, 4–89, 5–96 
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0–35–1, ఇమాద్‌ 3–0–25–0, రవూఫ్‌ 3–0–32–0, హసన్‌  4–0–44–0, షాదాబ్‌ 4–0–26–4, హఫీజ్‌ 1–0–13–0.   

చదవండి: Team India Coaching Staff: ద్రవిడ్‌ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..!

Poll
Loading...
మరిన్ని వార్తలు