T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్‌ ఏంటి?’

25 Oct, 2021 08:14 IST|Sakshi

ఓటమిని జీర్ణించుకోలేక ట్రోల్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు

టోర్నీ ఇప్పుడే మొదలైంది కదా అని అభిమానుల మద్దతు

T20 World Cup 2021 Ind Vs Pak: భారత్‌ భంగపాటుకు గురైంది. ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడిస్తే పాక్‌ జట్టుకు ఆర్థికంగా భారీ సహకారం అందించేందుకు ఒక కార్పొరేట్‌ సంస్థ ‘బ్లాంక్‌ చెక్‌’తో సిద్ధంగా ఉంది! వరల్డ్‌కప్‌కు ముందు బోర్డు అధ్యక్షుడు రమీజ్‌రాజా చేసిన వ్యాఖ్య ఇది. ఈ మాటే ప్రేరణ అందించిందో లేక స్టార్లు లేని టీమ్‌ ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిందో కానీ ఈ జట్టు అద్భుతం చేసింది. 

ఇమ్రాన్‌ ఖాన్‌ లాంటి దిగ్గజం నాయకత్వంలోని 1992 జట్టు కాలంనుంచి ప్రతీ సారి పట్టు వీడకుండా ప్రయత్నిస్తున్నా ఒక్కసారి కూడా దక్కని విజయం బాబర్‌ ఆజమ్‌ బృందం అందుకుంది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన అనంతరం ఛేదనను కూడా పాక్‌ సునాయాసంగా ముగించింది. రిజ్వాన్, బాబర్‌ భారీ భాగస్వామ్యం గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియాపై పది వికెట్ల విజయాన్ని అందించింది. 

ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసంగా మారడం వల్ల దక్కిన ఫలితమిది. అయితే రికార్డులకు ఎక్కడో ఒక చోట ముగింపు లభిస్తుంది కాబట్టి ఇది అలాంటి రోజుగా భావించి భారత్‌ తర్వాతి మ్యాచ్‌లలో చెలరేగిపోవచ్చు. ఎందుకంటే ఒక్క మ్యాచ్‌ ఓడినా ఇంకా వరల్డ్‌ కప్‌ ముగిసిపోలేదు!... అయితే, దాయాదుల పోరు భావోద్వేగాలతో ముడిపడిన అంశం. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

అందుకే... ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చేతిలో తొలి ఓటమిని కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘మన ఆటగాళ్లు డబ్బు ఎక్కువైన ‘స్టార్స్‌’లా ఆడితే... పాకిస్తాన్‌ ప్లేయర్లు ఆకలి మీదున్న అండర్‌డాగ్స్‌లా ఆడారు. ఇదే తేడా. మీరేం చేశారో మీకు అర్థమవుతుందా అయ్యా’’ అంటూ కోహ్లి సేన ఆట తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతేకాదు... ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులో ఆడించకుండా మేనేజ్‌మెంట్‌ చేసిన తప్పునకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని మండిపడుతున్నారు. 

హార్దిక్‌ పాండ్యా గల్లీ క్రికెట్‌ స్థాయిలో కూడా ఆడలేకపోయాడని.. పాండ్యా, రోహిత్‌ శర్మ తీవ్ర నిరాశకు గురిచేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు. అయితే.. మరికొందరు మాత్రం గెలుపోటములు సహజమని... ఇప్పుడే టోర్నీ ముగిసిపోలేదంటూ టీమిండియాకు అండగా నిలుస్తున్నారు. అయినా, ఈరోజు(ఆదివారం) గెలిచింది పాక్‌ జట్టు కాదు.. ఆట(క్రికెట్‌) అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Virat Kohli: ఐదారుగురు ఆటగాళ్లు నవ్వుతూ ఉన్నంత మాత్రాన...
Virat Kohli: వాళ్లు బాగా ఆడారు.. అయినా ఇదే చివరి మ్యాచ్‌ కాదు కదా

మరిన్ని వార్తలు