T20 WC 2021 IND Vs NAM: రాణించిన రోహిత్‌, రాహుల్‌.. నమీబియాపై టీమిండియా ఘన విజయం

8 Nov, 2021 22:32 IST|Sakshi

రాణించిన రోహిత్‌, రాహుల్‌.. నమీబియాపై టీమిండియా ఘన విజయం
సమయం 22:28.. నామమాత్రపు మ్యాచ్‌లో నమీబియా నిర్ధేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. రోహిత్‌ శర్మ(37 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌(36 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌(19 బంతుల్లో 25; 4 ఫోర్లు)లు 15.2 ఓవర్లలో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. నమీబియా బౌలర్లలో ఫ్రైలింక్‌కు ఏకైక వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌ విజయంతో టీమిండియా ఆటగాళ్లు.. టీ20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలికారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. రోహిత్‌ శర్మ(56) ఔట్‌
సమయం 22:00.. నమీబియా బౌలర్లను ఊచకోత కోసిన రోహిత్‌ శర్మ(37 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎట్టకేలకు ఔటయ్యాడు. జాన్‌ ఫ్రైలింక్‌ వేసిన 10వ ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 87/1. క్రీజ్‌లో కేఎల్‌ రాహుల్‌(31), సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు. 

రాణించిన భారత స్పిన్నర్లు.. నమీబియా గౌరవప్రదమైన స్కోర్‌
సమయం 20:59.. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్(3/20), జడేజా(3/16), పేసర్‌ బుమ్రా(2/19) రాణించడంతో నమీబియా గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. షమీ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో ట్రంపెల్‌మెన్‌(13).. ఫోర్‌, సిక్సర్‌ సహా 13 పరుగులు రాబట్టడంతో నమీబియా ఈ స్కోర్‌ సాధించగలిగింది. నమీబియా ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వీస్‌(26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన నబీమియా
అశ్విన్(3/20), జడేజా(3/16) తమ స్పిన్‌ మాయాజాలంతో పసికూన నమీబియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా నమీబియా 94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 18 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 114/7. క్రీజ్‌లో డేవిడ్‌ వీస్‌(25), జాన్‌ ఫ్రైలింక్‌(12) ఉన్నారు.

జడ్డూ మాయాజాలం.. మూడో వికెట్‌ కోల్పోయిన నమీబియా
సమయం 20:03.. రవీంద్ర జడేజా మరోసారి మాయ చేశాడు. నమీబియా ఆటగాడు స్టీఫెన్‌ బార్డ్‌(21 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌)ను బోల్తా కొట్టించాడు. 7.4వ ఓవర్లో బార్డ్‌.. జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫలితంగా నమీబియా 39 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో గెర్హార్డ్‌ ఎరాస్మస్‌(2), లాఫ్టీ ఈటన్ ఉన్నారు.  

జడ్డూ కమాల్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన నమీబియా
సమయం 19:57.. టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా మాయ చేశాడు. అద్భతమైన బంతితో క్రెయిగ్‌ విలియమ్స్‌(0)ను బోల్తా కొట్టించాడు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ సూపర్‌ స్టంపింగ్‌తో నమీబియా రెండో వికెట్‌ కోల్పోయింది. 6 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 34/2. క్రీజ్‌లో స్టీఫెన్‌ బార్డ్‌(15),గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ ఉన్నారు.  

తొలి వికెట్‌ కోల్పోయిన నమీబియా..వాన్‌ లింగెన్‌(14) ఔట్‌
సమయం 19:51.. టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా ధాటిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించింది. తొలి 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 31 పరగులు చేసింది. అయితే, 5వ ఓవర్‌లో బుమ్రా నమీబియాను దెబ్బకొట్టాడు. వాన్‌ లింగెన్‌(15 బంతుల్లో 14; 2 ఫోర్లు)ను ఔట్‌ చేశాడు. 5 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్‌ 33/1. క్రీజ్‌లో స్టీఫెన్‌ బార్డ్‌(15), క్రెయిగ్‌ విలియమ్స్‌ ఉన్నారు.

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌-2021లో టీమిండియా తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. సెమీస్‌ ఆశలు ఆవిరైన నేపథ్యంలో నామమాత్రపు పోరులో నేడు(నవంబర్‌ 8) పసికూన నమీబియాతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

టీ20 సారథిగా విరాట్‌ కోహ్లికి ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో ఈ నామమాత్రపు పోరుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టీ20 సారధిగా విరాట్‌ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా చూస్తుండగా.. కోహ్లి సేనకు కనీస పోటీనైనా ఇవ్వాలని నమీబియా భావిస్తుంది. కోహ్లి సహా రవిశాస్త్రి నేతృత్వంలోని శిక్షణా బృందానికి సైతం ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో భారత డ్రెసింగ్‌ రూమ్‌లో తీవ్ర భావోద్వేగం నెలకొంది.

తుది జట్లు:
భారత్‌: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్‌, విరాట్ కోహ్లి(కెప్టెన్‌), రిషబ్‌ పంత్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

నమీబియా: స్టీఫెన్‌ బార్డ్‌, క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్‌ కీపర్‌), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్‌), డేవిడ్ వీస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిట్‌, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, జాన్‌ ఫ్రైలింక్‌

మరిన్ని వార్తలు