T20 World Cup 2022: నాకు ఓటేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు: విరాట్‌ కోహ్లి

8 Nov, 2022 06:24 IST|Sakshi

దుబాయ్‌: భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గత నెలలో కనబరిచిన ప్రదర్శనకుగాను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో భారత క్రికెటర్‌ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్తాన్‌పై అసాధారణ ఇన్నింగ్స్‌తో (82 నాటౌట్‌) జట్టును గెలిపించిన కోహ్లి... నెదర్లాండ్స్‌ (62 నాటౌట్‌), బంగ్లాదేశ్‌ (64 నాటౌట్‌)లపై కూడా అజేయ అర్ధసెంచరీలతో శివమెత్తాడు. దక్షిణాఫ్రికా (12)తో విఫలమైన కోహ్లి... జింబాబ్వేపై 26 పరుగులు చేశాడు.

దీంతో కోహ్లితో పాటు అవార్డు రేసులో మిల్లర్‌ (దక్షిణాఫ్రికా), సికందర్‌ రజా (జింబాబ్వే) ఉన్నప్పటికీ భారత ఆటగాడినే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ వరించింది. నెలవరీ ప్రదర్శనకిచ్చే అవార్డు అతనికిదే తొలిసారి. ‘అక్టోబర్‌ నెలకు సంబంధించిన అవార్డు నాకు రావడం ఆనందంగా  ఉంది. నాకు ఓటేసిన క్రికెట్‌ అభిమానులు, ప్యానెల్‌ సభ్యులకు ధన్యవాదాలు’ అని కోహ్లి తెలిపినట్లు ఐసీసీ వెల్లడించింది. మహిళా క్రికెటర్లలో పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ నిదా దార్‌ ఈ అవార్డుకు ఎంపికయింది. ఆమెతో భారత ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ పోటీపడ్డారు. ఆయితే ఆసియా కప్‌ టోర్నీలో నిలకడగా రాణించిన పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌కే ఈ అవార్డు లభించింది.

మరిన్ని వార్తలు