T20 world cup 2022: గుణతిలకకు బెయిల్‌ తిరస్కరణ

8 Nov, 2022 06:20 IST|Sakshi

సస్పెండ్‌ చేసిన లంక బోర్డు  

సిడ్నీ: ఆస్ట్రేలియాలో రేప్‌ కేసులో అరెస్టయిన శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలకకు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. అతనికి బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అత్యాచారం కేసులో నిందితుడైన 31 ఏళ్ల క్రికెటర్‌పై శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) సస్పెన్షన్‌ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్‌ (స్థాయి, ఫార్మాట్, లీగ్‌) ఆడకుండా నిషేధం విధించింది. తీవ్రమైన క్రిమినల్‌ నేరానికి పాల్పడిన అతనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని శ్రీలంక క్రీడాశాఖ ఆదేశించింది.

ఆస్ట్రేలియా అధికారులకు సహకరిస్తామని ఎస్‌ఎల్‌సీ వర్గాలు తెలిపాయి. డౌనింగ్‌ సెంటర్‌ లోకల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ రాబర్ట్‌ విలియమ్స్‌ ముందు వర్చువల్‌ (వీడియో కాల్‌) పద్ధతిలో గుణతిలకను ప్రవేశపెట్టారు. అతని తరఫున లాయర్‌ ఆనంద అమరనాథ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా మెజిస్ట్రేట్‌ తిరస్కరించారు. దీనిపై స్పందించిన లాయర్‌ ఆనంద అతిత్వరలోనే సుప్రీం కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేస్తామన్నారు. టి20 ప్రపంచకప్‌ ‘సూపర్‌ 12’లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు స్వదేశానికి బయల్దేరే ముందు గుణతిలకను అరెస్టు చేయడంతో అతను మినహా మొత్తం జట్టు లంకకు పయనమైంది.

మరిన్ని వార్తలు