తిప్పేసిన షంషి.. ఇంటిదారి పట్టిన బాబర్‌ ఆజమ్‌ జట్టు

16 Aug, 2023 15:06 IST|Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా కొలొంబో స్ట్రయికర్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 15) జరిగిన మ్యాచ్‌లో గాలే టైటాన్స్‌ ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. ఓడిన కొలంబో జట్టు ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కొలొంబో.. గాలే స్పిన్నర్లు తబ్రేజ్‌ షంషి (4-0-20-4), సీక్కుగ్గే ప్రసన్న (3-0-14-3), షకీబ్‌ అల్‌ హసన్‌ (3.4-0-8-1) ధాటికి 15.4 ఓవర్లలో 74 పరుగులకు చాపచుట్టేసింది. గాలే స్పిన్‌ త్రయానికి పేసర్‌ లహీరు కుమార (2-1-9-2) తోడవ్వడంతో కొలొంబో ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.

కొలంబో ఇన్నింగ్స్‌లో నువనిదు ఫెర్నాండో (14) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. లహీరు ఉదాన (14), నిపున్‌ ధనంజయ (13), మహ్మద్‌ నవాజ్‌ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (2), స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ (6), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (5), కరుణరత్నే (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం కాగా.. షోరిఫుల్‌ ఇస్లాం, వాండర్‌సే ఖాతా కూడా తెరవలేకపోయారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే టైటాన్స్‌.. ఓపెనర్‌ లసిత్‌ క్రూస్‌పుల్లే (42 నాటౌట్‌), షకీబ్‌ (17 నాటౌట్‌) రాణించడంతో కేవలం 8.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. తద్వారా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గాలే ఇన్నింగ్స్‌లో భానుక రాజపక్ష (6), లిటన్‌ దాస్‌ (1) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా..వీరి వికెట్లు ఇఫ్తికార్‌ అహ్మద్‌కు, జెఫ్రీ వాండర్‌సేకు దక్కాయి.

ఈ గెలుపుతో గాలే దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరగా.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన కొలొంబో ఇంటిదారి పట్టింది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన దంబుల్లా ఔరా టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు కాగా.. గాలే టైటాన్స్‌ రెండో స్థానంలో, బి లవ్‌ క్యాండీ, జాఫ్నా కింగ్స్‌ 3, 4 స్థానాల్లో నిలిచాయి. గాలే-కొలొంబో మ్యాచ్‌తో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగియగా.. ఆగస్ట్‌ 17  నుంచి ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. 

ఆగస్ట్‌ 17: దంబుల్లా వర్సెస్‌ గాలే (క్వాలిఫయర్‌ 1)
                బి లవ్‌ క్యాండీ వర్సెస్‌ జాఫ్నా కింగ్స్‌ (ఎలిమినేటర్‌)
ఆగస్ట్‌ 19: క్వాలిఫయర్‌ 1లో ఓడిన జట్టు వర్సెస్‌ ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు (క్వాలిఫయర్‌ 2)

ఆగస్ట్‌ 20: క్వాలిఫయర్‌ 1లో గెలిచిన జట్టు వర్సెస్‌ క్వాలిఫయర్‌ 2లో గెలిచిన జట్టు (ఫైనల్‌)

మరిన్ని వార్తలు