‘చికెన్‌ కర్రీలో ఎలుక’ ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌!.. అరెస్టయిన మేనేజర్‌, చెఫ్‌లు రిలీజ్‌, జరిగింది ఇదే!

16 Aug, 2023 15:06 IST|Sakshi

రెస్టారెంట్‌లో చికెన్‌ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించడం.. ఆ వార్త ప్రముఖంగా వార్తల్లో, సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అవ్వడం తెలిసిందే.  అయితే.. ముంబై బాంద్రాలో జరిగిన ఈ ఘటనలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కస్టమర్లు ఫుల్‌గా తాగొచ్చి అల్లరి చేయడమే కాకుండా.. తప్పుడు కేసు బనాయించారని రెస్టారెంట్‌ మేనేజర్‌ వాపోతున్నాడు. 

ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బాంద్రా వెస్ట్‌ పరిధిలోని పాలి నాకాలోని పాపా పంచావో దా దాబా రెస్టారెంట్‌కు భోజ‌నం చేసేందుకు వెళ్లాడు. అక్కడ చికెన్‌, బ్రెడ్‌తో మ‌ట‌న్ తాలి ఆర్డ‌ర్ చేశారు.  ఫుడ్‌ తింటుండ‌గా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించ‌డంతో పరీక్షించి చూడగా అందులో చనిపోయిన చిన్న ఎలుక క‌నిపించింది. దీనిపై కంగుతిన్న కస్టమర్‌ రెస్టారెంట్ మేనేజ‌ర్‌ను  ప్ర‌శ్నించ‌గా స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు. మేనేజ‌ర్ తీరుపై ఆగ్ర‌హంతో బాంద్రా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజ‌ర్‌, చెఫ్‌తో పాటు సర్వర్‌ను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

తాగి వచ్చి డ్రామాలు
గత 22 ఏళ్లుగా రెస్టారెంట్‌ నడుస్తోంది. ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. మద్యం మత్తులో ఆ ఇద్దరూ మా రెస్టారెంట్‌కు వచ్చారు. వచ్చాక కూడా తాగుతూ కనిపించారు. మందు కోసం డిమాండ్‌ చేశారు.  మాది కేవలం ఫుడ్‌ డైనింగ్‌ మాత్రమని స్పష్టం చేసినా వినిపించుకోలేదు. సర్వర్‌తో గొడవ పడ్డారు. చివరకు చచ్చిన ఎలుకతో డ్రామాకు దిగారు. డబ్బు ఇస్తేనే సైలెంట్‌గా వెళ్లిపోతామని చెప్పారు. మేం ఒప్పుకోకపోవడంతో ఇంత రాద్ధాంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే.. వాస్తవాలు బయటపడతాయి అని మేనేజర్‌, సర్వర్‌లు చెబుతున్నారు.  

బెయిల్‌పై విడుదల
అయితే రెస్టారెంట్‌ పేరును దెబ్బ తీయడంతోపాటు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే రెస్టారెంట్‌పై అపవాదు మోపారని నిందితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మంగళవారం నిందితులు ముగ్గురినీ బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు.  కలుషిత ఆహారం నేరం కింద కేసు నమోదు అయ్యిందని.. ఎలుక బయటపడిందిగా చెబుతున్న ప్లేట్‌ను ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు పంపామని.. నివేదిక వస్తే అసలు విషయం బయటపడుతుందని బాంద్రా పోలీస్‌ అధికారి చెబుతున్నారు. 

చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..

మరిన్ని వార్తలు