టీమిండియాలో అతని ఎంపికే ఓ వివాదం..

9 Jun, 2021 20:22 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా డాషింగ్‌ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్ ఎంపిక అప్పట్లో ఓ పెద్ద వివాదానికి దారి తీసిందని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. 2014లో మాజీ కెప్టెన్ ధోనీ టెస్టులకి రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా ఎదిగాడని, అతను భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్న తరుణంలో సడన్‌గా రిషబ్ పంత్‌‌‌ని తమ బృందం తెరపైకి తెచ్చిందని, దీంతో ఆ సమయంలో తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నాడు.

అప్పట్లో పంత్‌ టెస్టులకు పనికిరాడని, అతని దూకుడు టెస్ట్‌ ఫార్మాట్‌కు సరిపోదని, కీపింగ్ విషయంలో ఫిట్‌నెస్‌ విషయంలో అలక్ష్యంగా ఉంటాడని అతనిపై అనేక రకాల విమర్శలు వచ్చాయని, అయినా పంత్‌ వాటన్నింటిని అధిగమించి రాటుదేలాడని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పంత్ ఘోరంగా విఫలమయ్యాడని, అయితే గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో తిరుగులేని ప్రదర్శన కనబర్చాడని, ఆ తర్వాత ఇంగ్లండ్‌పైనా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పంత్‌.. భారత్‌‌లోని టర్నింగ్ పిచ్‌లపై సైతం చక్కగా కీపింగ్ చేస్తున్నాడని, ఛాలెంజింగ్ కండీషన్లలో కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

సెలెక్టర్‌గా ప్రతిభని గుర్తించడం తన బాధ్యతని, అందులో భాగంగానే పంత్‌ ఎంపిక జరిగిందని, తన నమ్మకాన్ని పంత్‌ వమ్ము చేయలేదని తెలిపాడు. రెండేళ్ల కిందట చాలా మంది పంత్ ఈ స్థాయిలో రాణిస్తాడని ఊహించలేదని, అతన్ని విమర్శించిన వారే నేడు అతన్ని అందలం ఎక్కిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ గడ్డపై ఈ నెల 3న అడుగుపెట్టిన భారత జట్టు.. జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా జరిగే డబ్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ టూర్‌కి రిషబ్ పంత్‌ టీమిండియా ఫస్ట్ ఛాయిస్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
చదవండి: భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్‌.. కారణం తెలిస్తే షాక్‌
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు