IND vs NZ WC 2023: టీమిండియాతో మ్యాచ్‌.. న్యూజిలాండ్‌కు గుడ్‌ న్యూస్‌!

21 Oct, 2023 16:37 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్‌.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(ఆక్టోబర్‌22)న ధర్మశాల వేదికగా టీమిండియాతో కివీస్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్‌ అందింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.

ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సౌథీ చేతి వేలికి గాయమైంది. దీంతో అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. తమ జట్టుతో కలిసి భారత్‌కు వచ్చినప్పటికీ మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే సౌథీ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి జట్టు సెలక్షన్‌కు అందుబాటోకి వచ్చాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌  టామ్ లాథమ్ ధృవీకరించాడు.

"భారత్‌తో మ్యాచ్‌ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. ఇది గొప్ప పోటీ. ప్రపంచవ్యాప్తంగా కివీస్‌ ఎక్కడ ఆడినా అభిమానుల నుంచి సపోర్ట్‌ ఉంటుంది. ఈ భారత్‌లో కూడా బ్లాక్‌ క్యాప్స్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పటివకు ఈ టోర్నీలో  ఇప్పటివరకు అద్బుత విజయాలు సాధించాం. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా అదే రిథమ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.

ఇక కేన్‌ విలియమ్సన్‌ జట్టుతో ఉన్నప్పటికీ  బొటనవేలు గాయంతో బాధపడతున్నాడు. అతడు రోజు రోజుకు బాగా కోలుకుంటున్నాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నాను. అయితే టిమ్‌ సౌథీ మాత్రం ఫిట్‌నెస్‌ సాధించాడు. అతడు భారత్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు" అని ప్రీ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో టామ్ లాథమ్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు