పతకాల వేటకు విరామం

2 Sep, 2021 05:28 IST|Sakshi

పారాలింపిక్స్‌లో బుధవారం భారత్‌కు దక్కని పతకం

టోక్యో: వరుసగా మూడు రోజులపాటు టోక్యో పారాలింపిక్స్‌లో పతకాల పంట పండించిన భారత దివ్యాంగ క్రీడాకారులు బుధవారం నిరాశపరిచారు. షూటింగ్, అథ్లెటిక్స్‌లో మెడల్‌ ఈవెంట్స్‌లో పోటీపడిన భారత అథ్లెట్స్‌ పతకాలు నెగ్గలేకపోయారు. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌–1 విభాగం క్వాలిఫయింగ్‌లో పోటీపడిన అవనీ లేఖరా 629.7 పాయింట్లు స్కోరు చేసి 27వ స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన ఇతర షూటర్లు సిద్ధార్థ బాబు 625.5 పాయింట్లతో 40వ స్థానంలో... దీపక్‌ కుమార్‌ 624.9 పాయింట్లతో 43వ స్థానంలో నిలిచారు. సోమవారం 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అవని స్వర్ణం గెలిచి పారాలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

అథ్లెటిక్స్‌లో పురుషుల ఎఫ్‌–51 డిస్కస్‌/క్లబ్‌ త్రో విభాగంలో పోటీపడిన భారత క్రీడాకారులు అమిత్‌ కుమార్, ధరమ్‌బీర్‌ నిరాశపరిచారు. అమిత్‌ డిస్క్‌ను 27.27 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో, ధరమ్‌బీర్‌ డిస్క్‌ను 25.59 మీటర్ల దూరం విసిరి ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల స్విమ్మింగ్‌ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఎస్‌బీ–7 ఈవెంట్‌ ఫైనల్లో పోటీపడిన భారత స్విమ్మర్‌ సుయశ్‌ జాదవ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఈత కొట్టి డిస్‌క్వాలిఫై అయ్యాడు. బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌ రేసు మొదలుపెట్టాక మలుపు వద్ద ఒక్కసారి మాత్రమే బటర్‌ఫ్లయ్‌ కిక్‌ చేయాలి. కానీ సుయశ్‌ ఒకటికంటే ఎక్కువసార్లు చేయడంతో అతడిపై అనర్హత వేటు వేశారు.  బుధవారం పోటీలు ముగిశాక భారత్‌ 10 పతకాలతో 34వ స్థానంలో ఉంది.  

మరిన్ని వార్తలు