ట్రాన్స్‌జెండర్స్‌కు అర్హత లేదు

22 Nov, 2023 04:04 IST|Sakshi

మహిళల క్రికెట్‌లో పోటీ పడేందుకు అనర్హులు

ఐసీసీ నిర్ణయం

అహ్మదాబాద్‌: అంతర్జాతీయ మహిళల క్రికెట్‌ సమగ్రతను కాపాడేందుకు, గౌరవం పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట లింగ మార్పిడి చేసుకున్న అబ్బాయిలు పూర్తిగా అమ్మాయిల హోదా పొందినప్పటికీ అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అర్హత లభించదని మంగళవారం ఇక్కడ జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది నెలల సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తు తర్వాతే ఈ విధాన నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సీఈఓ జెఫ్‌ అలర్‌డైస్‌ తెలిపారు.

అయితే దేశవాళీ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్స్‌ను ఆడించే విషయమై ఆయా సభ్యదేశాలకే నిర్ణయాధికారం కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సెపె్టంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ‘ట్రాన్స్‌జెండర్‌’గా కెనడాకు చెందిన 29 ఏళ్ల డానిల్‌ మెక్‌గహే గుర్తింపు పొందింది. 2024 టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించేందుకు నిర్వహించిన అమెరికన్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో ఆమె కెనడా జట్టు తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి 118 పరుగులు సాధించింది. డానిల్‌ మెక్‌గహే కెనడా జాతీయ జట్టు తరఫున ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడినా వాటికి అంతర్జాతీయ హోదా లేదు.

డానిల్‌ ఆ్రస్టేలియాలో పుట్టి మూడేళ్ల క్రితం కెనడాకు వలస వచ్చింది. 2020లో పురుషుడి నుంచి స్త్రీగా మారేందుకు సిద్ధమైన ఆమె 2021లో వైద్యపరంగా పూర్తి స్థాయిలో మహిళగా మారింది. ట్రాన్స్‌జెండర్స్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం కల్పించడంపై  తీవ్ర విమర్శలు రావడంతో ఐసీసీ నిబంధనలు మార్చింది. మరోవైపు మ్యాచ్‌ అధికారులు, అంపైర్లకు ఇకపై లింగబేధం లేకుండా పురుష అంపైర్లతో సమానంగా మహిళా అంపైర్లకు వేతన భత్యాలు ఇస్తారు. 

 

మరిన్ని వార్తలు