నిప్పులు చెరిగిన పాక్‌ పేసర్‌.. మ్యాచ్‌ టై.. సూపర్‌ ఓవర్‌తో ఫలితం

28 Aug, 2023 17:55 IST|Sakshi

యూఎస్‌ మాస్టర్స్‌ టీ10 లీగ్‌ 2023 ఎడిషన్‌ విజేతగా టెక్సస్‌ ఛార్జర్స్‌ అవతరించింది. న్యూయార్క్‌ వారియర్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 27) జరిగిన ఫైనల్లో ఛార్జర్స్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతగా నిలిచింది. నిర్ణీత ఓవర్ల అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను తేల్చాల్సి వచ్చింది.  

రాణించిన కార్టర్‌..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూయార్క్‌ వారియర్స్‌.. టెయిలెండర్‌ జోనాథన్‌ కార్టర్‌ (17 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. న్యూయార్క్‌ ఇన్నింగ్స్‌లో కార్టర్‌ మినహా అందరూ తేలిపోయారు. దిల్షన్‌ (18),  రిచర్డ్‌ లెవి (17) రెండంకెల స్కోర్లు చేయగా.. మిస్బా ఉల్‌ హాక్‌ (5), షాహిద్‌ అఫ్రిది (1), కమ్రాన్‌ అక్మల్‌ (0), అబ్దుల్‌ రజాక్‌ (3) తస్సుమన్నారు. టెక్సస్‌ బౌలర్లలో ఎహసాన్‌ ఆదిల్‌ 3, ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, తిసార పెరీరా తలో వికెట్‌ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన సోహైల్‌ ఖాన్‌..
93 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టెక్సస్‌ ఛార్జర్స్‌.. సోహైల్‌ ఖాన్‌ (2-0-15-5), షాహిద్‌ అఫ్రిది (1-0-8-2), ఉమైద్‌ ఆసిఫ్‌ (2-0-14-2), జెరోమ్‌ టేలర్‌ (2-0-24-1) ధాటికి 10 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. ఛార్జర్స్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ హఫీజ్‌ (46), బెన్‌ డంక్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. స్కోర్లు సమం కావడంతో ఫలితాన్ని సూపర్‌ ఓవర్‌ ద్వారా నిర్ణయించారు. 

స్కోర్లు సమం.. సూపర్‌ ఓవర్‌లో ఫలితం 
సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛార్జర్స్‌.. వికెట్‌ నష్టపోయి 15 పరుగులు చేసింది. డంక్‌, ముక్తర్‌ చెరో సిక్సర్‌ బాది, ఈ స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డారు. ఛేదనలో వారియర్స్‌ 13 పరుగులకే పరిమతం​ కావడంతో టెక్సస్‌ ఛార్జర్స్‌ విజేతగా ఆవిర్భవించింది. కార్టర్‌ సిక్సర్‌, బౌండరీ బాదినా ప్రయోజనం లేకుండాపోయింది. సోహైల్‌ తన్వీర్‌ వారియర్స్‌ను కట్టడి చేశాడు. 

మరిన్ని వార్తలు