Virat Kohli: కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే!

21 Mar, 2023 17:58 IST|Sakshi

టీమిండియా స్టార్‌ కింగ్‌ కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 186 పరుగులతో దుమ్మురేపిన కోహ్లి.. వన్డేల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తాడనుకుంటే నిరాశపరుస్తున్నాడు. తొలి వన్డేలో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన కోహ్లి రెండో వన్డేలో మాత్రం 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన​సంగతి తెలిసిందే. ఇక చెన్నై వేదికగా బుధవారం ఇరుజట్ల మధ్య చివరి వన్డే జరగనుంది.

ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో కోహ్లి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ నిర్వహిస్తున్న మిస్టర్‌ 360 షోకి అతిథిగా హజరయ్యాడు. ఈ షోలో విరాట్‌ కోహ్లికి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పటివరకు నువ్వు చూసిన వారిలో వికెట్ల మధ్య ఫాస్ట్‌గా పరిగెత్తే బెస్ట్‌ రన్నర్‌ ఎవరు.. అలాగే వరస్ట్‌ రన్నర్‌ ఎవరు అని అడిగాడు.

''నా దృష్టిలో ఎంఎస్‌ ధోని కంటే ఏబీ డివిలియర్స్‌ బెస్ట్‌ రన్నర్‌ అని చెబుతాను. వాస్తవానికి ధోనికి, నాకు చాలామంచి టెంపో ఉంటుంది. మాహీతో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే నేను సింగిల్ కోసం కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గుడ్డిగా కళ్లు మూసుకుని పరిగెత్తొచ్చు. అయితే వికెట్ల మధ్య పరుగెత్తడంలో ఏబీ డివిల్లియర్స్ తర్వాతే ఎవరైనా అని కచ్చితంగా చెప్పగలను.అతను నాకంటే వేగంగా వికెట్ల మధ్య పరిగెడతాడు. కొన్నిసార్లు నేను కూడా అతనితో పరుగులు తీయడానికి వేగాన్ని అందుకోలేక అవుట్ అయిపోతానేమోనని భయపడ్డాను.

ఇక వికెట్ల మధ్య పరుగెత్తడంలో వరస్ట్ రన్నర్ అంటే చతేశ్వర్ పూజారా. అతన్ని నమ్మి పరుగెట్టాలంటే భయమేస్తుంది.పూజారాకి ఓపిక చాలా ఎక్కువ. క్విక్ సింగిల్స్ తీయాల్సిన అవసరం ఏముందని అతను నమ్ముతాడు. అందుకే పూజారాతో బ్యాటింగ్ చేస్తే అతను పిలిచే దాకా నాన్‌స్ట్రైయికింగ్‌లో పడుకోవచ్చు.. అంత టైమ్ ఉంటుంది. అందుకు నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది.

2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించాం. సెంచురియన్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ అనుకుంటా. నేను పెద్దగా పరుగులు చేయకుండానే డగౌట్‌కు చేరాను. నేను అలా వెళ్లి కూర్చొన్నాను లేదో సౌతాఫ్రికా శిబిరంలో సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. మిడాన్‌ దిశగా ఆడిన పుజారా పరుగు ​కోసం వెళ్లి రనౌట్‌ అయ్యాడు. ఎన్గిడి అనుకుంటా పుజారాను ఔట్‌ చేసింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ  పార్థివ్‌ పటేల్‌ గల్లీ దిశలో ఆడాడు. పుజారా పరుగుకు పిలవడంతో పటేల్‌ వెళ్లాడు. అయితే క్వినైన్‌ బంతిని అందుకొని పుజారా క్రీజులోకి రాకముందే బెయిల్స్‌ ఎగురగొట్టాడు. దీంతో పుజారా ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత డగౌట్‌కు వచ్చిన పుజారాకు చివాట్లు పెట్టాను.'' అంటూ గుర్తుచేసుకున్నాడు.

చదవండి: ఒక్క మ్యాచ్‌కే పరిమితం.. మళ్లీ అదే ఆటతీరు

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎంతవరకు విజయవంతం?

మరిన్ని వార్తలు