-

T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్‌ దింపుడు కల్లం ఆశలు..

31 Oct, 2022 10:04 IST|Sakshi
టీమిండియా- జింబాబ్వే చేతిలో ఓడిన పాకిస్తాన్‌ జట్టు

సెమీస్‌ కష్టమే...

T20 World Cup 2022- Group 2 Teams Semis Chances:  టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఆ జట్టు ముందంజ వేయడం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే సాంకేతికంగా మాత్రం పాక్‌కు ఇంకా చాన్స్‌ ఉంది. పాక్‌ మిగిలిన రెండూ గెలిచినా గరిష్టంగా 6 పాయింట్లు సాధించగలదు. నెదర్లాండ్స్‌పై గెలిస్తే 7 పాయింట్లతో దక్షిణాఫ్రికా ముందంజ వేస్తుంది.

మరోవైపు బంగ్లాదేశ్, జింబాబ్వేలపై గెలిస్తే భారత్‌కు 8 పాయింట్లు అవుతాయి. భారత్‌ ఒక మ్యాచ్‌ గెలిచి ఒకటి ఓడితే 6 పాయింట్లతో పాక్‌తో రన్‌రేట్‌లో పోటీ పడుతుంది. అయితే పాక్‌కంటే భారత్‌ రన్‌రేట్‌ ప్రస్తుతానికి ఎంతో మెరుగ్గా ఉండటంతో పాటు రోహిత్‌ సేన రెండూ గెలిచే అవకాశాలే పుష్కలం. గురువారం దక్షిణాఫ్రికా చేతిలో ఓడితే అక్కడే పాక్‌ కథ ముగుస్తుంది!  అయితే, టీ20 ఫార్మాట్‌ అంటేనే సంచనాలకు మారుపేరు! ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం!

గ్రూప్‌-2లో ఉన్న జట్ల సెమీస్‌ అవకాశాలు ఇలా
సౌతాఫ్రికా
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు- 3
పాయింట్లు-5
నెట్‌ రన్‌రేటు: 2.772
మిగిలి ఉన్న మ్యాచ్‌లు: పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో..

ఈ రెండింటిలో ఏ ఒక్క జట్టుపై గెలిచినా ఏడు పాయింట్లతో బవుమా బృందం ముందంజ వేస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్‌, జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లలో గెలిస్తే వరుసగా 8,7 పాయింట్లు సాధిస్తాయి. అయితే, రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న కారణంగా ప్రొటిస్‌కు వచ్చిన భయమేమీ లేదు. అంతేకాకుండా ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో టీమిండియా చేతిలో ఓడినట్లైతే ఇక సౌతాఫ్రికా సెమీస్‌ చేరడం నల్లేరు మీద నడకే!

ఇండియా
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు-3
పాయింట్లు-4
నెట్‌రన్‌ రేటు: 0.844
మిగిలిన మ్యాచ్‌లు: బంగ్లాదేశ్‌, జింబాబ్వే

ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌ చేరాలంటే టీమిండియా తప్పకుండా తమ తదుపరి మ్యాచ్‌లలో గెలవాలి. ఒకవేళ బంగ్లాదేశ్‌ను ఓడించి.. అనూహ్య పరిస్థితుల్లో జింబాబ్వే చేతిలో ఓడితే మాత్రం.. అప్పుడు సౌతాఫ్రికా, జింబాబ్వే ఏడు పాయింట్లతో ముందంజలో నిలుస్తాయి.

అలా కాకుండా రోహిత్‌ సేన జింబాబ్వేపై గెలిచి బంగ్లాదేశ్‌ చేతిలో ఓడినట్లయితే.. సౌతాఫ్రికాతో పాటు బంగ్లా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రెండింటిలో ఒకటి ఓడి ఒకటి గెలిచి.. అదే సమయంలో పాకిస్తాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు సాధిస్తే నెట్‌ రన్‌ రేటు పరంగా పోటీపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బంగ్లా, జింబాబ్వేపై రోహిత్‌ సేన తప్పకుండా గెలిస్తే నేరుగా సెమీస్‌కు అర్హత సాధించే ఛాన్స్‌ ఉంటుంది.

బంగ్లాదేశ్‌
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు-3
పాయింట్లు-4
నెట్‌ రన్‌రేటు: -1.533
మిగిలిన మ్యాచ్‌లు: ఇండియా, పాకిస్తాన్‌

పాయింట్ల పరంగా టీమిండియాతో సమానంగా ఉన్నప్పటికీ నెట్‌ రన్‌రేటు పరంగా వెనుకబడి ఉంది బంగ్లాదేశ్‌. మిగతా రెండు మ్యాచ్‌లో భారత్‌, పాక్‌తో పోటీ పడనున్న బంగ్లా.. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా సెమీస్‌ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. రెండూ గెలిస్తే మొత్తంగా 8 పాయింట్లు సాధించి ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకునే అవకాశాలు పుష్కలం.

జింబాబ్వే
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లు: 3
పాయింట్లు: 3
నెట్‌ రన్‌రేటు: -0.050
మిగిలిన మ్యాచ్‌లు: నెదర్లాండ్స్‌, ఇండియా
సెమీస్‌ రేసులో నిలవాలంటే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవాల్సిందే. ఒకవేళ నెదర్లాండ్స్‌ను ఓడించి ఇండియా చేతిలో ఓడితే వాళ్లకు ఐదు పాయింట్లు మాత్రమే వస్తాయి. సెమీస్‌ చేరేందుకు ఈ పాయింట్లు సరిపోవు మరి!

పాకిస్తాన్‌
ఇప్పటి వరకు ఆడినవి: 3
పాయింట్లు: 2
నెట్‌ రన్‌రేటు: 0.765
మిగిలిన మ్యాచ్‌లు: సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిన కారణంగా పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా పాక్‌ ఆరు పాయింట్లు సాధిస్తుంది. ఒకవేళ భారత్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకటి ఓడితే ఆరు పాయింట్లకే పరిమితం అవుతుంది కాబట్టి రన్‌రేటు పరంగా పాక్‌ పోటీ పడే అవకాశం ఉంటుంది. కానీ.. టీమిండియా ప్రస్తుత ఫామ్‌ను బట్టి రెండూ గెలిచే ఛాన్స్‌లే ఎక్కువ కాబట్టి.. పాక్‌ది దింపుడు కళ్లెం ఆశే అని చెప్పవచ్చు.

అయితే, ఒకవేళ పాకిస్తాన్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి, బంగ్లాదేశ్‌ టీమిండియాను ఓడిస్తే.. భారత్‌ జింబాబ్వేపై విజయం సాధిస్తే.. ఈ మూడు ఆసియా జట్ల మధ్య పోటీ నెలకొంటుంది. ఇక నెదర్లాండ్స్‌ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఓడి సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

కాగా టి20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన ‘సూపర్‌ 12’ గ్రూప్‌–2 లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోర్నీలో తొలి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక పాక్‌ తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం దక్షిణాఫ్రికాతో ఆడుతుంది.  

చదవండి: T20 World Cup 2022: ఎంత పనిచేశావు కోహ్లి.. ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే! వీడియో వైరల్‌
T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం
సూర్య బౌలర్ల మైండ్‌తో ఆటలు ఆడుకుంటాడు: పాక్‌ క్రికెటర్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు