No Ball Call: అంపైర్లపై అక్తర్‌ ట్వీట్‌.. అంతగా బుర్ర చించుకోకు! బాగా మండుతున్నట్లుంది ‍కదా!

24 Oct, 2022 13:29 IST|Sakshi

అక్తర్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

T20 World Cup 2022- India Vs Pakistan- Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్‌..  అసలే దాయాదుల పోరు.. బంతి బంతికీ ఉత్కంఠ...  గెలవడానికి భారత్‌ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్‌ హిట్టర్‌’ హార్దిక్‌ పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్‌ జోరు చూస్తుంటే మూడు షాట్‌లలో మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆదివారం నాటి ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  

19.1 నవాజ్‌ వేసిన తొలి బంతికి భారీ షాట్‌ ఆడిన పాండ్యా అవుటయ్యాడు.  
19.2క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్‌ ఇచ్చాడు. 
19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు. 
19.4 నవాజ్‌ వేసిన ఫుల్‌టాస్‌ను కోహ్లి డీప్‌ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచాడు. అంపైర్‌ దీనిని ‘హైట్‌ నోబాల్‌గా’ ప్రకటించాడు. దీంతో భారత్‌ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్‌కు ‘ఫ్రీ హిట్‌’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది.  

19.4 ఈసారి నవాజ్‌ వైడ్‌ వేశాడు. ఫ్రీ హిట్‌ సజీవంగా నిలిచింది.  
19.4 ఫ్రీ హిట్‌ బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. ‘ఫ్రీ హిట్‌’పై కేవలం రనౌట్‌ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్‌ మ్యాన్‌ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్‌ 3 ‘బై’ పరుగులు తీశారు!

చర్చకు తెరతీసిన ఆ మూడు పరుగులు
ఇప్పుడు ఈ విషయంపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఫ్రీ హిట్‌ బంతికి కోహ్లి బౌల్డ్‌ అయినా ఈ మూడు పరుగులు ఎలా ఇచ్చారన్న అంశం మీద ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్ హాగ్ ఇప్పటికే పలు ప్రశ్నలు లేవెనెత్తిన సంగతి తెలిసిందే.

ఇక ఈ విషయంలో అంపైర్ల నిర్ణయంపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ‘‘భయ్యా.. ఈరోజు రాత్రంతా బుర్ర చించుకునేలా మెదడుకు బాగానే మేత వేశారు కదా’’ అంటూ అంపైర్లను ఉద్దేశించి అతడు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

అంతలా బుర్ర చించుకోకు..
ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో అక్తర్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. ‘‘మరీ అంతలా బుర్ర చించుకోకు. బాగా మండుతున్నట్లుంది. బర్నాల్‌ రాసుకో. ఆ తర్వాత తీరిగ్గా ఐసీసీ రూల్స్‌ చదువు. సరేనా.. కాస్త ప్రశాంతంగా ఉండు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌తో అక్తర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.​

కాగా నో బాల్‌ నేపథ్యంలో 3 పరుగులు వచ్చిన తర్వాత  విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది.  ఈ క్రమంలో..
19.5 దినేశ్‌ కార్తీక్‌ స్వీప్‌ షాట్‌ ఆడగా బంతి అతని ప్యాడ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్‌ క్రీజులోకి వచ్చేలోపు పాక్‌ కీపర్‌ రిజ్వాన్‌ స్టంపౌట్‌ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది.  
19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్‌ లెగ్‌ సైడ్‌లో బంతి వేశాడు. అంపైర్‌ దానిని వైడ్‌గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది.  
19.6 ఈసారి నవాజ్‌ వేసిన బంతిని అశ్విన్‌ మిడాఫ్‌లో ఫీల్డర్‌ మీదుగా షాట్‌ ఆడాడు. పరుగు తీశాడు. భారత్‌ విజయం ఖరారైంది.  టీమిండియా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కింగ్‌ కోహ్లిపై సాహో అంటూ క్రీడాలోకం ప్రశంసల వర్షం కురిపించింది.

చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన పాక్ అభిమాని.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్‌
Virat Kohli: కోహ్లి తప్ప ఇంకెవరూ ఆ షాట్లు ఆడలేరు.. ఆ రెండు సిక్స్‌లు ప్రత్యేకం.. పాండ్యా ఫిదా.. కింగ్‌పై ప్రశంసల జల్లు

మరిన్ని వార్తలు