బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ

24 Oct, 2022 13:13 IST|Sakshi

సాక్షి, నల్గొండ జిల్లా: పోలింగ్‌ సమీపించే కొద్దీ మునుగోడులో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఘర్షణలకు దారి తీస్తుంది. దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణతో చౌటుప్పల్‌ మండలం జైకేసారం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
చదవండి: మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్‌.. టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎంపీ రాపోలు.. సీఎంతో భేటీ

​కాగా, నాంపల్లి మండలంలో ఆదివారం.. కాంగ్రెస్‌, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుకున్న సంగతి తెలిసిందే. తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచారం కోసం నాంపల్లికి వస్తున్న సమయంలో బీజేపీ దుండగులు తన కాన్వాయికి దారి ఇవ్వకుండా వాహనం నడిపారన్నారు. దారి ఎందుకు ఇవ్వడం లేదని అడిగినందుకు తన కారు డ్రైవర్‌ను, మహిళా కార్యకర్తలను బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు

మరిన్ని వార్తలు