WC 2023: చెత్త బౌలింగ్‌.. అయినా వరల్డ్‌కప్‌లో అరుదైన ఘనత! అతడి రికార్డుకు ఎసరు..

21 Oct, 2023 09:23 IST|Sakshi
మిచెల్‌ స్టార్క్‌ (ఫైల్‌ ఫొటో)

ICC ODI WC 2023: ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌ లెజెండరీ పేస్‌ బౌలర్‌ వసీం అక్రం పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆసీస్‌ శుక్రవారం పాకిస్తాన్‌తో తలపడింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పాకిస్తాన్‌కు.. కంగారూ ఓపెనర్లు చుక్కలు చూపించారు. డేవిడ్‌ వార్నర్‌- మిచెల్‌ మార్ష్‌ కలిసి మొదటి వికెట్‌కు రికార్డు స్థాయిలో 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్‌ 367 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో పాక్‌ 305 పరుగులకే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడం జంపా.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(18), మహ్మద్‌ రిజ్వాన్‌(46), ఇఫ్తికార్‌ అహ్మద్‌(26) రూపంలో కీలక వికెట్లు తీయడంతో పాటు మహ్మద్‌ నవాజ్‌(14) వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే, స్టార్క్‌ మాత్రం ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 8 ఓవర్ల బౌలింగ్‌లో ఏక​ంగా 65 పరుగులు సమర్పించుకుని.. ఒక (హసన్‌ అలీ(8)) వికెట్‌ తీయగలిగాడు. అయినప్పటికీ ఓ అరుదైన రికార్డు సాధించాడు.

వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వసీం అక్రంతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్‌ బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ బౌలర్లు
►గ్లెన్‌ మెగ్రాత్‌(ఆస్ట్రేలియా)- 39 మ్యాచ్‌లలో 71 వికెట్లు
►ముత్తయ్య మురళీధరన్‌(శ్రీలంక)- 40 మ్యాచ్‌లలో 68 వికెట్లు
►లసిత్‌ మలింగ(శ్రీలంక)- 29 మ్యాచ్‌లలో 56 వికెట్లు
►మిచెల్‌ స్టార్క్‌(ఆస్ట్రేలియా)- 22 మ్యాచ్‌లలో 55 వికెట్లు
►వసీం అక్రం(పాకిస్తాన్‌)- 38 మ్యాచ్‌లలో 55 వికెట్లు.
►►వసీం అక్రం కంటే వేగంగా స్టార్క్‌ 55 వికెట్లు తీయడం గమనార్హం.

చదవండి: WC 2023: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.: బాబర్‌ ఆజం

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు