WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. సిరాజ్‌కు రెస్ట్‌! జట్టులోకి అశ్విన్‌.. ఎందుకంటే?

26 Oct, 2023 12:48 IST|Sakshi

WC 2023- India vs England: సొంతగడ్డపై అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తూ వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీస్‌ రేసులో ఉన్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల కంటే ఓ విజయం ఎక్కువే సాధించి పది పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది.

ఈ క్రమంలో తదుపరి ఇంగ్లండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది రోహిత్‌ సేన. లక్నోలో అక్టోబరు 29న ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తుదిజట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇంగ్లండ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.

ఇంగ్లండ్‌ బ్యాటర్లు స్పిన్‌ ఆడలేరు.. కాబట్టి
ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘కుల్దీప్‌ యాదవ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందనుకుంటున్నా. కుల్దీప్‌, రవీంద్ర జడేజాతో పాటు అశ్విన్‌ కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే.. ఇంగ్లండ్‌ బ్యాటర్లు స్పిన్‌ సరిగ్గా ఆడలేరు. ఇప్పటికే ఇంగ్లండ్‌ ఈ వరల్డ్‌కప్‌ టోర్నీలో బాగా వెనుకబడిపోయింది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్‌లో గనుక బంతి స్పిన్‌ అవడం మొదలుపెడితే వారికి కష్టాలు తప్పవు.

షమీ సత్తా చాటాడు.. ఒకవేళ..
కాబట్టి తదుపరి మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుంది. సిరాజ్‌ వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కాబట్టి అతడికి రెస్ట్‌ ఇస్తే బాగుంటుంది. ఇక షమీ జట్టులోకి వచ్చీ రాగానే 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.

ఏదేమైనా లక్నోలో బంతి టర్న్‌ అయితే తప్ప టీమిండియా తుదిజట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. పిచ్‌ నార్మల్‌గా ఉంటే.. న్యూజిలాండ్‌తో బరిలోకి దిగిన జట్టే ఇక్కడా కొనసాగుతుంది. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ కాబట్టి వికెట్‌ స్లోగా ఉండాలని టీమిండియా అభిమానులు కోరుకుంటారు’’ అని హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. కాగా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నాలుగింట కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హర్భజన్‌ ఎంచుకున్న టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్‌ రాయల్స్‌ మాజీ కోచ్‌ 

మరిన్ని వార్తలు