WC 2023: వరుస విజయాలతో జోష్‌లో ఉన్న టీమిండియాకు మరో గుడ్‌న్యూస్‌!

30 Oct, 2023 13:48 IST|Sakshi
టీమిండియా పేసర్‌ సిరాజ్‌తో హార్దిక్‌ పాండ్యా (పాత ఫొటో)

ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు మరో శుభవార్త! గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కోలుకుంటున్నట్లు సమాచారం. కీలక సమయంలో అతడు జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. చీలమండ నొప్పితో విలవిల్లాడిన అతడు తన ఓవర్‌ మధ్యలోనే మైదానం వీడాడు. దీంతో స్టార్‌​ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(రైట్‌ఆర్మ్‌ పేసర్‌) పాండ్యా ఓవర్‌ను పూర్తి చేశాడు.

అప్పటి నుంచి జట్టుకు దూరం
అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీమిండియా ఇన్నింగ్స్‌ సమయంలో హార్దిక్‌ పాండ్యా మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌లకు సైతం ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ దూరమయ్యాడు.

ఇక ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న హార్దిక్‌ పాండ్యా.. నొప్పి నుంచి ఉపశమనం పొంది ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌ ఆరంభించినట్లు తెలుస్తోంది. లీగ్‌ దశ ముగిసేనాటికి పూర్తిగా కోలుకుని.. నవంబరు 15 నాటికి జట్టుతో చేరే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.

కీలక సమయంలో కచ్చితంగా వచ్చే అవకాశం!
‘‘జాతీయ క్రికెట్‌ అకాడమీలో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న హార్దిక్‌ పాండ్యా ఇప్పటికే రెండు నెట్‌ సెషన్స్‌లో పాల్గొన్నాడు. అయితే, తను ఎప్పుడు తిరిగి వస్తాడో కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ.. నాకౌట్స్‌ వరకు పూర్తిగా కోలుకునే అవకాశం మాత్రం ఉంది’’ అని  బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం ఉన్నట్లు న్యూస్‌18 తన కథనంలో పేర్కొంది.

ఇంకో రెండురోజుల్లో అప్‌డేట్‌!
మరోవైపు.. టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే మాత్రం హార్దిక్‌ రికవరీ గురించి తమకు ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందలేదని పేర్కొనడం గమనార్హం. మరో రెండు రోజుల్లో హార్దిక్‌ గురించి అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌పై టీమిండియా విజయానంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

ఆ మూడు మ్యాచ్‌ల తర్వాత
ఇదిలా ఉంటే.. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ శ్రీలంకతో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబరు 2న ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లతో లీగ్‌ దశను ముగించనున్న రోహిత్‌ సేన సెమీ ఫైనల్స్‌ బెర్తును ఇప్పటికే ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచకప్‌-2023లో నవంబరు 15న తొలి సెమీ ఫైనల్‌, 16న రెండో సెమీస్‌ మ్యాచ్‌, 19న ఫైనల్‌ జరుగనున్నాయి.

A post shared by ICC (@icc)

చదవండి: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ గండం గట్టెక్కితే! వరల్డ్‌ రికార్డు మనదే
భారత బౌలర్ల దెబ్బకు తలవంచక తప్పలేదు.. అయినా ఇంగ్లండ్‌కు ఆ గోల్డెన్‌ ఛాన్స్‌! 

మరిన్ని వార్తలు