WC 2023: సెంచరీతో చెలరేగిన రచిన్‌.. సచిన్‌ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

4 Nov, 2023 13:47 IST|Sakshi

ICC ODI WC 2023- Pak Vs NZ: వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర సెంచరీతో దుమ్ములేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్ల వర్షం కురిపించాడు. పాక్‌ బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ.. సంపూర్ణ ఆధిపత్యం కనబరిచాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ‘సొంత ప్రేక్షకులకు’ కావాల్సినంత వినోదం పంచుతూ .. ఏకంగా 15 బౌండరీలు బాదాడీ భారత మూలాలున్న కివీస్‌ క్రికెటర్‌. ఇక పాక్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న రచిన్‌ రవీంద్ర 108 పరుగులు సాధించాడు.

A post shared by ICC (@icc)

సచిన్‌ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
తద్వారా భారత్‌ వేదికగా ప్రపంచకప్‌-2023లో మూడో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాతికేళ్ల వయసులోపే వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

కాగా రచిన్‌ 23 ఏళ్ల 351 రోజుల వయసులో ఈ ఫీట్‌(3 శతకాలు) సాధించగా.. సచిన్‌ టెండుల్కర్‌ 22 ఏళ్ల 313 రోజుల వయసులో ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు చేశాడు. 

కివీస్‌ తరఫున తొలి బ్యాటర్‌గా
సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేయడంతో న్యూజిలాండ్‌ తరఫున అరుదైన ఘనత కూడా సాధించాడు రచిన్‌ రవీంద్ర. సింగిల్‌ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అత్యధిక శతకాలు(3) బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.  గతంలో గ్లెన్ టర్నర్ 1975 వరల్డ్‌కప్‌లో రెండు, మార్టిన్ గప్టిల్ 2015లో రెండు, 2019లో కేన్‌ విలిమయ్సన్‌ రెండు శతకాలు సాధించారు. 

కాగా ప్రస్తుత ప్రపంచకప్‌ ఎడిషన్‌లో రచిన్‌ రవీంద్ర తొలుత ఇంగ్లండ్‌.. తర్వాత ఆస్ట్రేలియా.. తాజాగా పాకిస్తాన్‌పై సెంచరీలు నమోదు చేశాడు.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు